- Local News, News, Political

చదివేది ఇంజనీరింగ్… చేసేది స్మగ్లింగ్…

విశాఖ నుంచి చెన్నైకి గంజాయి అక్రమ రవాణా

పోలీసుల అదుపులో ఏడుగురు విద్యార్థులు
16 కేజీల సరుకు స్వాధీనం
ఏపీ: వారంతా ఇంజనీరింగ్‌ విద్యార్థులు.. చెడు వ్యసనాలకు బానిసలయ్యారు.. జల్సాల కోసం ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి ముఠా అవతారమెత్తారు. విశాఖ నుంచి చెన్నైకి గంజాయిని అక్రమంగా తరలించి విక్రయించడం మొదలుపెట్టారు. కానీ.. పోలీసుల చేతికి చిక్కారు. కావలి డీఎస్పీ డీ ప్రసాద్‌ తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్‌ చదువుతున్న కొందరు విద్యార్థులు గంజాయికి బానిసలయ్యారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో నెల్లూరు ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఒక టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది కావలిలోని ఉదయగిరి రోడ్డుకు సమీపంలో ఉన్న ఒక ప్రైవేటు కళాశాల మైదానంలో సోమవారం ఐదుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులకు చిక్కిన వారిలో సుంకరి పవన్‌ కల్యాణ్‌ (శ్రీకాకుళం), లోకనాథ్‌ (విశాఖపట్నం), ప్రత్యూష్‌ సిన్హా (పుణె), బండారు రవితేజ (విజయనగరం)తోపాటు పాలేటి అమరనాథ్‌ (నెల్లూరు) ఉన్నారు. వారిని విచారించగా అనేక విషయాలు వెలుగుచూశాయి. తమిళనాడులోని వేలూరు ‘విట్‌’ కళాశాలలో కొంతమంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారారని, వారికి గంజాయి విక్రయించి భారీగా సొమ్ము చేసుకోవచ్చని పథకం రచించారు. దీనికోసం విశాఖపట్నంలోని బ్రోకర్‌ సహకారంతో ఏజెన్సీ నుంచి విక్రయదారుడు సాయంతో గంజాయిని కొనుగోలు చేయడం ప్రారంభించారు. విశాఖ నుంచి వేలూరుకు కార్లలో, రైళ్లలో గంజాయిని సరిహద్దులు దాటించేవారు. విశాఖలో రూ.4-5 వేలకు కొన్న కిలో గంజాయిని వారు విట్‌ విద్యార్థులకు రూ.9-10 వేలకు విక్రయించేవారని తెలిసింది.
అయితే దీనిపై సమాచారం అందడంతో నిఘాపెట్టిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1.60 లక్షల విలువ చేసే 16 కేజీల గంజాయి, వోక్స్‌వ్యాగన్‌ కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా.. వేలూరు విట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలోని విద్యార్థులకు విక్రయించేందుకు విశాఖ నుంచి చెన్నైకి ఏడు కేజీల గంజాయిని తీసుకెళ్తున్న ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థులను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ.70 వేల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *