- Local News, News

రైల్వే ఉద్యోగులు పేరిట టోకరా…

విశాఖ/పెందుర్తి: రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి ముగ్గురు నిరుద్యోగుల నుంచి నుంచి రూ.20 లక్షలు వసూలు చేసి పరారైన వ్యక్తులపై పెందుర్తి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేపగుంట సమీపంలోని నాయుడుతోటకు చెందిన వైవీఎస్‌ఎన్‌ రాజు, ఎన్‌వీవీర్‌ రాజు, పూసర్లపాటి సునీత ఐటీఐ, డిగ్రీ చదివి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తునిలో ప్రైవేటు ఫిజియోథెరఫిస్టుగా పని చేస్తున్న గణేష్‌ (28) వీరికి పరిచయం అయ్యాడు. అతడి ద్వారా తునిలో ఓ చర్చి పాస్టర్‌గా ఉన్న సునీల్‌తో పాటు ముత్యాలరాజు కూడా పరిచయం అయ్యారు. ఈ నేపథ్యంలో గణేష్‌, సునీల్‌, ముత్యాలరాజు తమకు రైల్వే శాఖలో పలుకుబడి ఉందని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులైన ముగ్గురిని నమ్మించారు. ఉద్యోగాల కోసం కొంత ఖర్చు అవుతుందని చెప్పారు. వారి మాటలను నమ్మిన వైవీఎస్‌ఎన్‌ రాజు, ఎన్‌వీవీర్‌ రాజు, పూసర్లపాటి సునీత మొత్తం రూ.10 లక్షలు ముట్టజెప్పారు.
  కొన్ని రోజుల అనంతరం నకిలీ గుర్తింపు కార్డులు, కాల్‌లెటర్లు సృష్టించి మీరు రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం హైదరాబాద్‌లో శిక్షణ తీసుకోవాలని చెప్పారు. ఇది నిజమేనని నమ్మిన నిరుద్యోగులు హైదరాబాద్‌ వెళ్లి గణేష్‌ మిత్రబృందం చెప్పిన చోట వారం రోజులు శిక్షణ తీసుకున్నారు. శిక్షణ పూర్తయిందని మీ ఇంటికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు పోస్టులో వస్తాయని చెప్పడంతో అక్కడి నుంచి నిరుద్యోగులు ముగ్గురు వచ్చేశారు.
అయితే రోజులు గడుస్తున్నా ఎలాంటి అపాయింట్‌మెంట్‌ లెటర్లు రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు గణేష్‌ను నిలదీశారు. మలి విడత ట్రైనింగ్‌ ఒంగోలులో ఉందని అది పూర్తయితే ఉద్యోగాలు వస్తాయని చెప్పడంతో వీరి అనుమానం మరింత బలపడింది. ఉద్యోగాలకు ముట్టజెప్పిన సొమ్ములు తిరి ఇవ్వమని అడగడంతో ఈ వ్యవహారంలో ముత్యాలరాజు ప్రధాన సూత్రధారి అని చెప్పి గణేష్‌ తప్పించుకుని తిరగసాగాడు. దీనిపై బాధితులు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *