- Local News, News, Political

కాపు నేస్తంతో కాంతులు

ఆ సామాజిక వర్గ మహిళలకు ఆర్థిక చేయూత

ఏడాదికి రూ.15 వేలు..ఐదేళ్లలో రూ.75 వేలు

కేబినెట్‌ ఆమోదంతో వారిలో ఆనందం

విశాఖపట్నం: సంక్షేమం… అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అన్ని వర్గాలకూ ఆపన్న హస్తాన్ని అందిస్తున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా చితికిపోయిన కుటుంబాలకు నేనున్నానంటూ ప్రభుత్వం చేయూత అందిస్తోంది. తాజాగా కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు.. కాపు సామాజిక వర్గానికి కొత్త ఊపిరి పోసింది.  వైఎస్సార్‌ కాపునేస్తం పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.

సుస్థిర అభివృద్ధి దిశగా.. 
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా పథకాలను ప్రవేశపెడుతూ సుస్థిర అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతి కేబినెట్‌లోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల మన్ననలు చూరగొంటోంది. తాజాగా నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజల మోముల్లో సరికొత్త ఆనందాన్ని నింపుతున్నాయి. ఇందులో భాగంగా ఆమోదించిన పథకం వైఎస్సార్‌ కాపునేస్తం. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, ఉప కులాల మహిళల జీవన ప్రమాణాల్ని పెంచేలా.. వారికి ఆర్థిక స్వావలంబన చేకూర్చేలా కాపునేస్తం పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ఉపాధి అవకాశాలు మెరుగు..
కాపునేస్తం పథకం ద్వారా ఆయా సామాజిక వర్గాల మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ప్రభుత్వం చేయూత ఇవ్వనుంది. వారి ఉపాధి అవకాశాల్ని మెరుగు పరిచేందుకు ఈ పథకం ఉపయుక్తమవుతుంది.  ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున చొప్పున ఐదేళ్ల పాటు రూ.75 వేలు ప్రభుత్వం అందజేస్తుంది.

నిబంధనలివీ.. 
►గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదా యం నెలకు రూ.10 వేలు ఉండాలి.
►పట్టణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం రూ.12 వేలు ఉన్న వారు అర్హులు
►కారు ఉన్నవారు అనర్హులు
►ట్యాక్సీ, మినీ వ్యాన్‌ వంటి వాటి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి మినహాయింపు ఇచ్చారు.
►కుటుంబంలో వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు తీసుకుంటున్న వారు ఉన్నా కాపునేస్తం వర్తిస్తుంది.
►2020 నుంచి 2024 వరకూ ఐదేళ్ల పాటు కాపునేస్తం ద్వారా సాయం అందుతుంది.

జగనన్న మేలు మరువలేం 
మహిళలు ఆర్థికంగా ఎదగాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆశిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో వరాలు ఇచ్చా రు. ప్రధానంగా మహిళలకు ఆయన చేస్తున్న మేలు ఎన్నటికీ మరువలేం. ఏ ప్రభుత్వం కూడా కాపులను పట్టించుకోలేదు. జగన్‌ మాత్రమే అన్ని కులాలకు న్యాయం చేస్తున్నారు. కాపు నేస్తంతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆసరా కల్పిస్తున్నారు.
–  సుంకర రాము, గొట్టివాడ, కోటవురట్ల మండలం 

అడక్కుండానే సాయం.. 
కాపునేస్తం పథకంతో మా కుటుంబాలలో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి జగన్‌ కృషి చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటూ వెళుతున్నారు. అడక్కుండానే వరాలు ఇస్తున్నారు. గత ప్రభుత్వం ఎన్నో బూటకపు హామీలు ఇచ్చి మోసం చేసింది. మహిళలను నమ్మించి నిలువునా ముంచేసింది. జగన్‌ మాత్రమే మా బాగోగులు పట్టించుకుంటున్నారు. ఆయనకు రుణపడి ఉంటాం.
– బత్తిన చిలకమ్మ, గొట్టివాడ, కోటవురట్ల మండలం 

2054 మంది గుర్తింపు.. 
కాపు నేస్తం పథకానికి జిల్లాలో ఇప్పటి వరకు 2054 మందిని గుర్తించాం.ప్రస్తుతం వైఎస్సార్‌ నవశకం సర్వే జరుగుతోంది. ఇది పూర్తయితే అర్హుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ పథకానికి 45 సంవత్సరాలు దాటిన కాపు మహిళలు అర్హులుగా చెబుతున్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళలు నవశకం సర్వేలో సహకారం అందించాలి.
– పెంటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, బీసీ కార్పొరేషన్, విశాఖపట్నం

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *