- Local News, News, Political

రెబెల్స్…అధికార పార్టీకి అసంతృప్తుల బెడద

 బుజ్జగించినా ప్రయోజనం శూన్యం
స్వతంత్రంగా బరిలోకి అసంతృప్తులు
టీఆర్‌ఎస్‌ పార్టీకి రెబెల్స్‌ దడ పట్టుకుంది. పార్టీ టికెట్‌ దక్కకపోవడంతో రెబెల్స్‌గా బరిలో దిగుతున్నారు. ముఖ్యనేతలు బుజ్జగించినా కొన్నిచోట్ల ప్రయోజనం లేకుండాపోయింది. ఉద్యమ సమయం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ కోసం పనిచేసిన వారు తమకు పార్టీ టికెట్‌ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. టికెట్‌ రాకపోవడంతో.. రెబెల్స్‌గా ఎన్నికల బరిలోకి దిగారు. ఒక్కో వార్డు నుంచి ఇద్దరు నుంచి గరిష్ఠంగా నలుగురు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈసారి తప్పుకుంటే… వచ్చేసారి పార్టీ టికెట్‌ తప్పకుండా మీకే ఇస్తామంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేసిన లాభం లేకుండా పోయింది. మున్సిపల్‌ కోఆప్షన్‌, నామినేటెడ్‌ పదవులు ఇప్పిస్తామని హామీ ఇచ్చి కొందరిని నామినేషన్లను ఉపసంహరించుకునే విధంగా చేశారు. మరికొందరికి పార్టీ పదవులతోపాటు ఆర్థికంగా తోడ్పాటు అందజేస్తామని చెప్పి పోటీ నుంచి తప్పించారు.
జిల్లాలో మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల్లో 351 వార్డులు/డివిజన్లు ఉన్నాయి. మొత్తం అన్నిపార్టీల నుంచి 2,405 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. 1,084 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో రెబల్స్‌ అభ్యర్థులు తప్పుకోకుంటే.. పార్టీ పరంగా చర్యలు తప్పవని హెచ్చరించడంతో కొంతమంది అభ్యర్థులు భయపడి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. షాద్‌నగర్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు రెబెల్స్‌ బెడద తప్పడం లేదు. ప్రధానంగా 6, 14, 10, 19వ వార్డుల్లో రెబల్స్‌ పోటీలో ఉన్నారు. శంకర్‌పల్లి మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ తరఫున 1, 3, 4, 13వ వార్డుల్లో ఒకరు చొప్పున, 11వ వార్డులో ము గ్గురు, 14వవార్డులో ఇద్దరు చొప్పున రెబల్స్‌గా ఉన్నారు. శంషాబాద్‌ మున్సిపాలిటీలోని 9, 25వ వార్డులో అసంతృప్తులు బరిలో ఉన్నారు. జల్‌పల్లి మున్సిపాలిటీలో 13,16,18,19 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు రెబెల్స్‌ బెడద తప్పటం లేదు. అలాగే తుక్కుగూడ మున్సిపాలిటీలోని తుక్కుడ, రావిర్యాలలో బీజేపీ, టీఆర్‌ఎస్‌
అభ్యర్థులకు రెబెల్‌గా పోటీలో ఉన్నారు. ఇదిలాఉండగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆదిభట్ల మున్సిపాలిటీలోని 7వ వార్డులో, శంషాబాద్‌ మున్సిపాలిటీ నుంచి రెబల్‌గా అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
బీజేపీలో పోటీ చేసే అభ్యర్థులు తగ్గారు
మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసే అభ్యర్థుల సంఖ్య మిగతా ప్రధాన పార్టీలతో పోల్చుకుని చూస్తే తక్కువగానే కనిపిస్తోంది. బీజేపీ నుంచి మూడు మున్సిపాలిటీల్లోని 100 వార్డులకు 94 మంది నామినేషన్‌ వేసినప్పటికీ.. కార్పొరేషన్లలో మాత్రం అభ్యర్థులు తక్కువగానే ఉన్నారు. 12 మున్సిపాలిటీలోని 251వార్డుల్లో 149మంది అభ్యర్థులు బరిలో ఉ న్నారు. అలాగే టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి 248, కాంగ్రెస్‌ నుంచి 217 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *