- Local News, News, Political

కుటుంబ నియంత్రణ’ పై పురుషుల అనాసక్తి

ప్రోత్సాహకాలు ఉన్నా వేసెక్టమీ ఆపరేషన్‌..

చేయించుకోవడానికి వెనకడుగు

హైదరాబాద్‌ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ (వేసెక్టమీ) చేయించుకోవడానికి పురుషులు వెనకడుగు వేస్తున్నారు. అత్యధికశాతం మహిళలే చేయించుకుంటున్నారు. హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఏడాదికి ఐదు వందల మంది పురుషులు కూడా కుటుంబ నియంత్రణ చేయించుకోవడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ప్రతి ఏడాది 28-30 వేలమంది మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకుంటున్నారు.

ప్రచారం లేకపోవడం..

హైదరాబాద్‌లో కుటంబ నియంత్రణలో పురుషుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. వేసెక్టమీపై అపోహలు ఉండడంతో చాలామంది వెనుకంజ వేస్తున్నారని వైద్యులు అంటున్నారు. వాస్తవానికి మహిళలకంటే పురుషులకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ త్వరగా పూర్తవుతుంది. కానీ మగవారు చేయించుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. మాకెందుకు ఈ కష్టాలు అని తప్పించుకొంటున్నారు.
‘మేం చేసుకోలేం… ఆ బాధ్యత మీదేనని’ భార్యలపై మోపుతున్నారు. ‘కుటుంబ నియంత్రణ చేయించుకోవడం మా బాధ్యత కాదు… మీరే చేయించుకోండని’ దగ్గర ఉండి చేయిస్తున్నారు. మూఢ నమ్మకాలు, భయం పురుషులను వీడడం లేదు. వేసెక్టమీ గురించి అవగాహన కల్పించడంలో వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం విఫలమవుతోంది. ప్రచార సాధనాల ద్వారా ఆశించిన ప్రయోజనాన్ని సాధించలేకపోతోంది.
ఐదు శాతంలోపే…
కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకుంటున్న పురుషుల సంఖ్య ఐదుశాతం కూడా ఉండడం లేదు. 2008-2009లో 3263 వేసెక్టమీ, 38,185 ట్యూబెక్టమీ ఆపరేషన్లు జరిగాయి. 2006 నుంచి 2019 వరకు ఏడాదికి వేసెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటున్న వారు ఐదువందల మంది లోపే.
మూడు నిమిషాల్లోనే వేసెక్టమీ
కుటుంబ నియంత్రణలో అనేక అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. కొత్త విధానాల వల్ల కోతలు, కుట్లు సమస్యలు ఉండవు. రక్తస్రావం అయ్యే అవకాశం ఉండదని వైద్యులు అంటున్నారు. ట్యూబెక్టమీ కంటే వేసెక్టమీ చాలా సులువు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స జరిగిన గంట తరువాత పురుషులు తమ పనులను యధావిధిగా చేసుకోవచ్చు. మహిళలకు కొంచెం ఇ్బబందికరంగా ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. నొప్పి, వైట్‌ డిశ్చార్జి వంటి సమస్యలను ట్యూబెక్టమీ చేయించుకున్న మహిళలు ఎదుర్కొంటున్నారని వివరించారు. ట్యూబెక్టమీ కంటే వేసెక్టమీ చేయించుకునే వారికే ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. అయినా పురుషులు ముందుకు రావడం లేదు.
కుటుంబ నియంత్రణలో పురుషుల సంఖ్య పెంచడంలో వైద్య ఆరోగ్యశాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఆపరేషన్ల లక్ష్యాన్ని అధిగమించేందుకు ఆలోచిస్తున్నారే తప్ప అవగాహన కల్పించడంపై దృష్టి సారించడం లేదు. పురుషులు కుటుంబ నియంత్రణ చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *