Jai surya news కొనకుండానే కారు మీ ఇంటికి! - Jaisurya News

కొనకుండానే కారు మీ ఇంటికి!

హైదరాబాద్‌కూ విస్తరించిన మారుతీ సబ్‌స్క్రిప్షన్ స్కీమ్‌!

దిల్లీ: దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా అందిస్తున్న వాహన సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రాంను ఇప్పుడు హైదరాబాద్‌, పుణె నగరాలకూ విస్తరించింది. ఇప్పటి వరకు ఈ స్కీమ్‌ దిల్లీ, బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ స్కీమ్‌లో కారును నేరుగా కొనుగోలు చేయకుండానే ఉపయోగించుకోవచ్చు. ప్రతి నెలా నిర్వహణ ఛార్జీల కింద కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌ అమలు కోసం జపాన్‌కు చెందిన ఒరిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఇండియా కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

మారుతీ సుజుకీ సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా కారు తీసుకున్న వ్యక్తి ప్రతి నెలా కొంత మొత్తం చెల్లించాలి. కారు నిర్వహణ, ఇన్సూరెన్స్, రోడ్‌సైడ్ అసిస్ట్ వంటి వాటిని కంపెనీయే చూసుకుంటుంది. అయితే, ఆ ఛార్జీలను మాత్రం వినియోగదారులు చెల్లించే నెలవారీ మొత్తం నుంచే వసూలు చేయనుంది.

స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజా, ఎర్టిగా, ఎరీనా, బాలెనో, సియాజ్, ఎక్స్‌ఎల్ 6 వంటి మోడళ్లను ఈ స్కీమ్‌ కింద వినియోగదారులు పొందవచ్చు. తీసుకునే కారును బట్టి చెల్లించాల్సిన మొత్తం ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్‌లో స్విఫ్ట్‌ ఎల్‌ఎక్స్‌ఐకి కనిష్ఠ నెలవారీ మొత్తం రూ.15,354. వినియోగదారులు 12 నెలల నుంచి 48 నెలల వరకు కారును సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. వచ్చే 2 నుంచి 3 ఏళ్లలో ఈ స్కీమ్‌ను దేశవ్యాప్తంగా 60 పట్టణాల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కంపెనీ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *