Jai surya news విశాఖకు అంతర్జాతీయ ఘనత - Jaisurya News

విశాఖకు అంతర్జాతీయ ఘనత

విశాఖలోని ఆల్‌ ఎబిలిటీ పార్క్‌స్మార్ట్‌ సిటీ వరల్డ్‌ కాంగ్రెస్‌లో మూడో స్థానం

మన దేశం నుంచి ఎంపికైన ఏకైక స్మార్ట్‌ సిటీ

ప్రపంచ నగరాలతో పోటీపడిన ఆల్‌ ఎబిలిటీ పార్క్‌

విశాఖపట్నం : అంతర్జాతీయ అవార్డు రేసులో విశాఖ మహానగరం మూడో స్థానాన్ని దక్కించుకుంది. స్పెయిన్‌లో జరిగిన స్మార్ట్‌ సిటీ ఎక్స్‌పో వరల్డ్‌ కాంగ్రెస్‌–2020లో విశాఖ స్మార్ట్‌ సిటీ ప్రపంచ నగరాలతో పోటీ పడింది. ‘లివింగ్‌ అండ్‌ ఇన్‌క్లూజన్‌ అవార్డు’ కేటగిరీలో మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ అండ్‌ సక్సెస్‌ఫుల్‌ ప్రాజెక్టులతో ప్రపంచంలోని 20 నగరాలు పోటీ పడగా.. విశాఖ మూడో స్థానంలో నిలిచింది. బీచ్‌ రోడ్డులో రూ.3.50 కోట్లతో నిర్మించిన ‘ఆల్‌ ఎబిలిటీ పార్క్‌’ లివింగ్‌ అండ్‌ ఇన్‌క్లూజన్‌ అవార్డుకు పోటీ పడింది. ఏడు కేటగిరీల్లో ఈ అవార్డులు ప్రకటించారు. మొత్తం ఈ ఎక్స్‌పోలో ప్రపంచం నలుమూలల నుంచి 46 నగరాలు పాల్గొనగా.. భారత్‌ నుంచి కేవలం విశాఖపట్నం మాత్రమే అర్హత పొందడం విశేషం. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ ఎక్స్‌పోలో బుధవారం ఆయా కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు. తొలి స్థానంలో మురికివాడల అభివృద్ధి ప్రాజెక్టుతో బ్రెజిల్‌ విజేతగా నిలవగా, అంతర్జాతీయ విరాళాల ద్వారా పేదలకు సంబంధించిన వివిధ రకాల బిల్లుల్ని చెల్లించేప్రాజెక్టుతో టరీ్క దేశంలోని ఇస్తాంబుల్‌ సిటీ రెండో స్థానంలో నిలిచింది.

దేశంలోనే తొలి ఎబిలిటీ పార్క్‌  
బీచ్‌ రోడ్డులో వైఎంసీఏ ఎదురుగా రూ.3.50 కోట్లతో ఆల్‌ ఎబిలిటీ పార్క్‌ తీర్చిదిద్దారు. సాధారణ ప్రజలు, పిల్లలతో పాటు విభిన్న ప్రతిభావంతులు కూడా ఈ పార్కులో ఆటలాడుకొని ఎంజాయ్‌ చేసేలా పార్కు నిర్మించారు. పార్కులో క్లైంబింగ్‌ నెట్, పిల్లలు ఆటలాడుకునే ఎక్విప్‌మెంట్, షిప్‌ డెక్, మ్యూజికల్‌ పోల్స్, ప్లే గ్రౌండ్‌ డ్రమ్స్‌తో పాటు ప్రత్యేక విద్యుత్‌ దీపాలంకరణతో తీర్చిదిద్దే ల్యాండ్‌ స్కేప్‌లు ఉన్నాయి. విభిన్న ప్రతిభావంతుల కోసం మూడు సీట్ల మేరీ గ్రౌండ్‌ కూడా ఏర్పాటు చేశారు. దివ్యాంగులు కూడా ఎంజాయ్‌ చేసేలా దేశంలో రూపొందిన తొలి ఎబిలిటీ పార్క్‌ ఇదే కావడం విశేషం. ప్రజల ఆనందానికి, ఆహ్లాదానికి వినియోగించుకునేలా.. ముఖ్యంగా చిన్నారులకు సరికొత్త అనుభూతిని పంచుతున్న ఈ పార్కుని యూకే అంబాసిడర్‌తో పాటు అమెరికన్ల ప్రశంసలందుకుంది.

వచ్చే ఏడాది మొదటి స్థానం ఖాయం 
స్మార్ట్‌ సిటీ ఎక్స్‌పో వరల్డ్‌ కాంగ్రెస్‌–2020లో జీవీఎంసీ ప్రాజెక్ట్‌ మొదటి స్థానం సాధించలేకపోయినందుకు బాధగా ఉన్నా.. దేశం నుంచి ఎంపికైన ఏకైక ప్రాజెక్ట్‌ ఆల్‌ ఎబిలిటీ పార్క్‌ కావడం గమనార్హం. అవార్డు కోసం ప్రపంచంలోని అతి పెద్ద ప్రముఖ నగరాలతో విశాఖ పోటీ పడటం గర్వంగా ఉంది. వచ్చే ఏడాది బార్సిలోనాలో జరిగే స్మార్ట్‌ సిటీ ఎక్స్‌పో వరల్డ్‌ కాంగ్రెస్‌–2021లో విశాఖ ఒక కేటగిరీలో అయినా మొదటి స్థానంలో నిలిచి అంతర్జాతీయ అవార్డు సొంతం చేసుకుంటుంది. 
– జి.సృజన, జీవీఎంసీ కమిషనర్‌  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *