Jai surya news ఫీజులపై నాన్చుడు! - Jaisurya News

ఫీజులపై నాన్చుడు!

నిలిచిపోయిన ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియ 

సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయినా జాడలేని జీవో

డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌పై ప్రభావం

అమరావతి : ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వ నాన్చుడు ధోరణితో 2020-21 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్‌, డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేక్‌ పడింది. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ అక్టోబరు నెలాఖరులోనే డిగ్రీ కోర్సులకు, ఈ నెల 12న ఇంజనీరింగ్‌తో పాటు అన్ని ప్రొఫెషనల్‌ కాలేజీలకు సంబంధించిన ఫీజులను సిఫారసు చేసినా ఇంతవరకు ఉత్తర్వులు విడుదల కాలేదు. మరో పది రోజుల్లో తరగతులు ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ ఈ వ్యవహారం సాగదీస్తుండటంతో అడ్మిషన్లపై అనిశ్చితి నెలకొంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  ఎంసెట్‌-ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్ల పరిశీలన గత నెలలోనే పూర్తయింది. కానీ ప్రభుత్వం ఫీజులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ఇంజనీరింగ్‌ ఆప్షన్ల ప్రక్రియ చేపట్టలేకపోయారు. దీంతో ఎంతోమంది మెరిట్‌ విద్యార్థులు రాష్ట్రంలోని డీమ్డ్‌ వర్సిటీలకు, పొరుగు రాష్ట్రాల విద్యాసంస్థలకు తరలివెళ్లారు.

అయినా అడ్మిషన్ల ప్రక్రియలో అసాధారణ జాప్యం జరుగుతోందని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 230 ఇంజనీరింగ్‌ కాలేజీలకు 2020-23 వరకు అంటే మూడేళ్ల బ్లాక్‌ పీరియడ్‌ ఫీజును రెగ్యులేటరీ కమిషన్‌ సిఫారసు చేసింది. అలాగే బి.ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌, ఎంటెక్‌, ఎంఫార్మసీ, లా, ఎంబీఏ, ఎంసీఏ తదితర ప్రొఫెషనల్‌ కోర్సులకు కూడా ఫీజులను కమిషన్‌ సిఫారసు చేసింది. బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల ఫీజులు కూడా ఖరారయ్యాయి. ఈ మేరకు కమిషన్‌ తమ సిఫారసులను పాఠశాల విద్యాశాఖకు సమర్పించింది. కానీ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల కాకపోవడంతో అడ్మిషన్ల ప్రక్రియ ఆగిపోయింది. ఫీజులకు సంబంధించి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ఆ ప్రభావం డిగ్రీ కోర్సుల అడ్మిషన్లపైనా పడింది. ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకుని ఈ నెల 7న నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి భావించినా ఫీజుల జీఓ రాకపోవడంతో వాయిదా అనివార్యమైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలకు 2020-21 విద్యా సంవత్సరానికి పాత ఫీజులే అమలు కానున్నాయని విశ్వసనీయంగా తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *