Jai surya news రాజధాని తరలింపు మతిలేని చర్య కాదా? - Jaisurya News

రాజధాని తరలింపు మతిలేని చర్య కాదా?

వేల కోట్లు ఖర్చు చేసి ఇప్పుడు తరలిస్తామంటారా?

ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వానిది ‘మతిలేని చర్య’ అంటే తప్పేంటి?
హెబియస్‌ కార్పస్‌ వ్యాజ్యాలపై విచారణలో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

అమరావతి : రాజధాని ప్రాంతంలో చాలా భవనాలు నిర్మించి.. ఎక్కడివక్కడే వదిలేశారు. రోజూ వాటిని అలా చూస్తుంటే హృదయం ద్రవించిపోతోంది. ప్రజల సొమ్మును అలా వృథా చేస్తే బాధపడేది వారే కదా.– హైకోర్టు ధర్మాసనంనేరస్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరిస్తూ కచ్చితంగా శాసనం/ చట్టం ఉండాల్సిందే. లేకపోతే నేరస్థులందరూ ఉన్నత పదవుల్ని అధిరోహించి ప్రజాస్వామ్యాన్ని ఇష్టారాజ్యంగా వాడుకుంటారు. ఓ ప్యూన్‌ పోస్టుకు తీసుకునేటప్పుడు ఆ వ్యక్తి విద్యార్హతలు చూస్తారు. నేరచరిత్ర పరిశీలిస్తారు. ఎన్నికల్లో పోటీకి అవేమీ అక్కర్లేకపోవడం ఆశ్చర్యమే. నేరస్థులు నిప్పుతో ఆటలాడుతున్నారు.. ఏదో ఒకరోజు అది వారిని దహించేస్తుంది.– హైకోర్టు ధర్మాసనం

రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేసి ప్రస్తుతం తరలిస్తామనడం ప్రభుత్వ మతిలేని చర్య (మైండ్‌లెస్‌ యాక్షన్‌) కాదా? అని హైకోర్టు ఘాటుగా ప్రశ్నించింది. రాజధాని కోసం రూ.3 వేల కోట్లు ఖర్చు చేశాక ఎక్కడి పనుల్ని అక్కడే నిలిపేయడం ఏమిటని మండిపడింది. ప్రభుత్వం ఖర్చు చేసిన ఆ సొమ్మంతా ప్రజలదని.. పనులు నిలిపేయడంతో అంతిమంగా వ్యథకు గురయ్యేది ప్రజలేనని పేర్కొంది. రాజధాని ప్రాంతంలో చాలా భవనాలు నిర్మించి.. ఎక్కడివాటిని అక్కడే వదిలేశారని వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకు ఖర్చు చేసిందంతా ప్రభుత్వానికి, ప్రజలకు జరిగిన నష్టమా, కాదా అని ప్రశ్నించింది. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పిటిషనర్‌ తన అఫిడవిట్లో ‘ప్రస్తుత ప్రభుత్వం మతిలేని చర్య’ అని పేర్కొంటే తప్పేమిటని ప్రత్యేక సీనియర్‌ కౌన్సెల్‌ ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌ను ప్రశ్నించింది. తమ భూముల నుంచి ఖాళీ చేయించకుండా రెవెన్యూ అధికారుల్ని నిలువరించాలంటూ దాఖలైన పలు వ్యాజ్యాల్లో చట్ట నిబంధనలు అనుసరించాలనీ తామే ఆదేశించినట్లు కూడా గుర్తు చేసింది. నిబంధనలను పాటించకుండా పిటిషనర్లను ఖాళీ చేయించడం రాష్ట్ర ప్రభుత్వ మతిలేని చర్య కాదా? అని నిలదీసింది. పోలీసులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తుల్ని కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థిస్తూ దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రభుత్వ తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. వాదనల కొనసాగింపునకు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ప్రజాచైతన్య యాత్రకు పోలీసుల అనుమతితో విశాఖ వెళ్లిన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సీఆర్‌సీపీ సెక్షన్‌ 151 కింద నోటీసిచ్చి పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని, ప్రతిపక్ష పార్టీలు చేపట్టే ర్యాలీలు, సమావేశాలను పోలీసులు అడ్డుకోవడాన్ని సవాలు చేస్తూ తెదేపా మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ దాఖలు చేసిన పిల్‌పై శుక్రవారం విచారణ జరిగింది. పోలీసుల తరఫున సీనియర్‌ కౌన్సెల్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుత ప్రభుత్వ మతిలేని చర్య (మైండ్‌లెస్‌ యాక్షన్‌)పై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రతిపక్షనేత యాత్ర చేపట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారన్నారు. ‘మతి లేని చర్య’ అనడంపై అభ్యంతరం తెలిపారు. దీంతో రాజధాని అమరావతిలో పనులు నిలిపేయడాన్ని గుర్తు చేసిన ధర్మాసనం అది ప్రభుత్వ మతిలేని చర్య కాదా? అని ప్రశ్నించింది.

కోర్టులు వాటి పరిధిని మరిచిపోతున్నాయి: సీనియర్‌ కౌన్సెల్‌
సీనియర్‌ కౌన్సెల్‌ స్పందిస్తూ.. తాను రాజధాని కేసుల్లో వాదనలు వినిపించే న్యాయవాదిని కాదని, ఆ వ్యాజ్యాల్ని విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనంలో మీరు జడ్జ్జిగా లేరని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని విషయం పూర్తిగా ప్రభుత్వ పరిపాలనాపరమైన అంశమని, అందులో కోర్టులు జోక్యం చేసుకోకూడదని చెప్పారు. కోర్టులు వాటి విచారణాధికార పరిధి, పాత్రను మరిచిపోతున్నాయని అన్నారు. ఆ వ్యాఖ్యలపై ధర్మాసనం స్పందిస్తూ.. మీ ప్రభుత్వం మాత్రం సమాజ అభ్యున్నతికి, రాష్ట్ర అభివృద్ధి కోసమే అన్ని పనులు చేస్తుందా? మా వద్ద ఇలాంటి విషయాలు చెప్పకండి అని ఘాటుగా వ్యాఖ్యానించింది. తాను కోర్టుకు వచ్చేటప్పుడు నిర్మాణ పనులు నిలిచిపోయిన భారీ భవంతులను చూసి ఆశ్చర్యంతోపాటు బాధ కూడా కలుగుతోందని జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. సౌకర్యాల లేమితో సిబ్బంది, న్యాయవాదులు ఇబ్బంది పడుతున్నారనే వ్యక్తిగత బాధతో ఈ విషయాన్ని చెబుతున్నానన్నారు. సీనియర్‌ కౌన్సెల్‌ స్పందిస్తూ.. ‘ఆ ప్రాంతానికి (హైకోర్టుకు) వెళ్లినప్పుడు ఎడారికి వెళ్లినట్లు అనిపిస్తుంది. చీకటిపడితే వెనక్కిరావడం కష్టమనిపిస్తుంది. నీళ్లు లేవు. టీ దొరకదు. న్యాయవాదులు మధ్యాహ్నం భోజనం చేయడానికి సౌకర్యం లేదు. అస్వస్థతకు గురైౖతే చికిత్సకు ఆస్పత్రి లేదు. అసలు చుట్టుపక్కల ఏమీ లేని ఆ ప్రాంతానికి గత పరిపాలనా యంత్రాంగం ఎందుకెళ్లిందో తెలీదు. బహుశా రాజధాని ఇక్కడే ఉంటే నష్టం రూ.100 కోట్లు ఉంటే.. ఇక్కడి నుంచి తరలిస్తే రూ.10 కోట్లు మాత్రమే ఉంటుంది. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ దాఖలు చేసిన ప్రస్తుత పిల్‌కు విచారణార్హత లేదు. అది రాజకీయ ప్రయోజన వ్యాజ్యం’ అని అన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ఎవరికీ ఇబ్బంది కలగకుండా ధర్నాలు, నిరసనలు చేపట్టిన వారికి ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలని, అలా జరగకపోవడం వల్లే వారు కోర్టుకొస్తున్నారని పేర్కొంది. హైకోర్టుకు వచ్చే మార్గంలో కొంతమంది నల్లజెండాలతో నిలబడుతున్నారు.. దీనిని పోలీసులు అనుమతించొచ్చా? అని ప్రశ్నించింది.

రాజకీయ పార్టీ బ్రాంచ్‌ కార్యాలయంగా మారిందంటారా?
సమస్యలపై వ్యాజ్యాలు వేస్తే పిటిషనర్లపై దాడి చేస్తున్న ఘటనలు, పిటిషన్లను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెస్తున్న విషయాలు తమ దృష్టికి వస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. ప్రజాహిత వ్యాజ్యాల ఉపసంహరణకు అనుమతించబోమంది. సీనియర్‌ కౌన్సెల్‌ ప్రసాద్‌ స్పందిస్తూ.. ప్రజలు ఉద్వేగంతో ఉంటారన్నారు. ధర్మాసనం విభేదిస్తూ సాధారణ ప్రజలు ఇలాంటి వాటికి పాల్పడరంది. హైకోర్టు తీర్పు ఇస్తే.. పార్లమెంట్‌ సభ్యుడు టీవీ ముందుకెళ్లి ఆరోపణ చేయడం ఏమిటని ఆగ్రహించింది. తీర్పు నచ్చకపోతే సరిగా లేదని చెప్పడం పరిపాటేనని, ఆ చర్య కోర్టుధిక్కరణ కిందకు రాదని సీనియర్‌ కౌన్సెల్‌ అనడంతో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. హైకోర్టు ఒక రాజకీయ పార్టీకి బ్రాంచ్‌ ఆఫీసుగా మారిపోయిందని అంటారా? ఇది తీర్పును బాగాలేదనడమా? ఆ వ్యాఖ్యలు కోర్టుధిక్కరణ కిందకు రావా? ప్రజాస్వామ్య దేశంలో ఇదేనా పద్ధతి అని నిలదీసింది.

ఏ రాజకీయ పార్టీలైనా అంతే
రాజధాని తరలించొద్దని ధర్నా చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు మందడం గ్రామానికి వస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్న అంశం హైకోర్టులో చర్చకు వచ్చింది. సీనియర్‌ కౌన్సిల్‌ వాదనలు వినిపిస్తూ.. పవన్‌ కల్యాణ్‌ భారీ కాన్వాయ్‌తో రైతుల వద్దకు చేరుకున్నారన్నారు. ప్రతి రాజకీయ నేత తన జనబలగాన్ని చూపాలనుకుంటున్నారని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ దేశంలోని ఏ రాజకీయ పార్టీలైనా అంతేనని తెలిపింది. జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ బిహార్‌లో ఓ ఘటనను ఉదహరిస్తూ ఓ సాధారణ వ్యక్తి సర్పంచి (ముఖియా) స్థాయికి చేరుకున్నాక రెండు మూడు నెలల్లోనే పెద్ద కార్లలో తిరిగేవారని, తర్వాత కొద్ది రోజులకు ధనవంతుడయ్యారన్నారు. ఇలాంటి వాటన్నింటినీ కట్టడి చేయాలన్నారు.

ఎన్నికల్లో పోటీకి అర్హతలు అక్కర్లేదా?
నేరస్థులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరిస్తూ తప్పనిసరిగా శాసనం/చట్టం ఉండాలని, లేకపోతే వారంతా ఉన్నత పదవుల్ని అధిరోహించి ప్రజాస్వామ్యాన్ని వారికి నచ్చినట్లు వాడుకుంటారని జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. ‘ఒక ప్యూన్‌ పోస్టు భర్తీ చేయాలన్నా విద్యార్హతలు చూస్తారు. నేర చరిత్రపై ఆరా తీస్తారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వాటన్నింటితో పనిలేకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నేరస్థులు అధికారంలోకి రాకుండా నిలువరిస్తూ చట్టాలు చేసే విషయంలో ఎవరూ జాగ్రత్త వహించడం లేదు. సుప్రీంకోర్టు సైతం ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయెచ్చంటోంది. ఇలాంటిదే ఓ విషయంలో నేను ఇబ్బందిపడ్డా. హత్యకేసులో నిందితుడిగా జైల్లో ఉన్న పప్పూయాదవ్‌ బిహార్‌ ఎన్నికల్లో నామినేషన్‌ వేయడానికి వెళ్లేందుకు అనుమతించాలని పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని అధ్యయనం చేశాను. జైల్లో ఎంత కాలం ఉంటారో అంతకాలం ఓటు హక్కును సస్పెండ్‌ చేయవచ్చనే నిబంధన ఉంది కానీ.. జైల్లో ఉండి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారికి ఎలాంటి నిబంధనలూ లేవు. ప్రజాస్వామ్యంలో ఇదో లోపం’ అన్నారు. ఎంతో కష్టపడి ఐఏఎస్‌, ఐపీఎస్‌లైన అధికారులు నేరస్థులైన ప్రజాప్రతినిధుల ఆజ్ఞలకు కట్టుబడి ఉండాల్సి వస్తోందన్నారు. బిహార్‌లో ఓ నేరస్థుడు ఎన్నికల్లో గెలిచి హోం మంత్రి అయ్యారని.. ఆయనకు సెల్యూట్‌ చేయాల్సి వస్తోందని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారని గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లో నేరప్రవృత్తికి అడ్డుకట్ట వేసే విషయంలో ఏదో ఒకటి జరగకపోతే.. క్రిమినల్స్‌ పాలించే రోజు వస్తుందని జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ అధికారిని డిస్మిస్‌ చేయాలి
ప్రజాచైతన్య యాత్రకు విశాఖ వెళ్లిన ప్రతిపక్షనేత చంద్రబాబుకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 151 కింద నోటీసిచ్చి అరెస్ట్‌ చేయడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. అసిస్టెంట్‌ పోలీసు కమిషనర్‌ స్థాయి అధికారి చట్ట నిబంధనలు పాటించకపోవడం ఏమిటని ప్రశ్నించింది. క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని సీనియర్‌ కౌన్సిల్‌ తెలపగా.. డిస్మిస్‌ చేయాలని పేర్కొంది. ర్యాలీలు, సమావేశాల సమయంలో భద్రత కల్పించాల్సింది పోలీసులేనని.. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత వారిపైనే ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *