Jai surya news ఏటా వాహనదారులపై భారం - Jaisurya News

ఏటా వాహనదారులపై భారం

ఏటా వాహనదారులపై భారం
35 రాష్ట్ర రహదారుల్లో అమలుకు సన్నద్ధం
తొలుత 11 మార్గాల్లో రెండేళ్లపాటు వసూలు

అమరావతి: ప్రతి సంవత్సరం రూ.400 కోట్ల మేర రాబడి అంచనాతో ప్రభుత్వం మరిన్ని రాష్ట్ర రహదారులపై టోల్‌ వసూలుకు వేగంగా సన్నాహాలు చేస్తోంది. టోల్‌ ఫీజులు, నిబంధనల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులివ్వగా, త్వరలో టెండర్ల ప్రక్రియకు ఇంజినీర్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జాతీయ రహదారులపై సొంత వాహనాల్లో రాకపోకలు సాగించేవారు, సరకు రవాణా వాహనదారులు టోల్‌ ఫీజుల భారం అధికంగా ఉందని గగ్గోలు పెడుతున్నారు. ఇకపై వివిధ రాష్ట్ర రహదారులపై ప్రయాణించినందుకు సైతం జేబులు ఖాళీ అవనున్నాయి.

ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ(ఆర్డీసీ) బలోపేతం, రహదారుల పనులకు నిధులు సమకూర్చుకోవడం పేరిట ఈ టోల్‌ వసూలుకు దిగనున్నారు. మొత్తంగా 35 రహదారులను ఎంపిక చేయగా, వీటిపై వాహనాల రద్దీ రోజుకు 6 వేల నుంచి 12 వేల పీసీయూలు (పాసింజర్‌ కార్‌ యూనిట్లు) వరకు ఉంది.

తొలుత రెండేళ్లు… తర్వాత పదేళ్లు
టోల్‌ వసూలుకు తొలుత 11 రహదారులను ఎంపిక చేశారు. వీటిలో ప్రస్తుతం అంతగా నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, దాదాపు బాగున్నవే ఉన్నాయి. ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత, టెండర్లు పిలిచి గుత్తేదారులను ఎంపిక చేస్తారు. ఈ రోడ్లపై రెండేళ్లలో రూ.217.40 కోట్ల రాబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఏకంగా పదేళ్లపాటు గుత్తేదారులకు టోల్‌ బాధ్యతలు ఇస్తారని చెబుతున్నారు. మరోవైపు రెండో దశలో కొంత మరమ్మతులు చేయాల్సిన రోడ్లను మూడో దశలో కొంతమేర విస్తరణ, అభివృద్ధి చేయాల్సిన రోడ్లను ఎంపిక చేశారు.

‘టోల్‌’ ఆలోచన విరమించుకోండి

‘ఇప్పటికే రాష్ట్రంలో రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ తరుణంలో రాష్ట్ర రహదారులపై టోల్‌ వసూలు చేసేలా ప్రభుత్వం చేస్తున్న  ఆలోచన  వాహనదారులకు పెనుభారంగా మారుతుంది. దీనిని విరమించుకోవాలి’ అని ఏపీ లారీ యజమానుల  సంఘం కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు సీఎం జగన్‌కు  శుక్రవారం  లేఖ రాసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. 1997లో కేంద్రం నాలుగు వరుసల జాతీయ రహదారులపై టోల్‌ వసూలు ఆరంభించి, రోడ్డు వ్యయానికి సరిపడా వసూలయ్యాక  తొలగిస్తామని చెప్పి ఇప్పటికీ కొనసాగిస్తూ, ఏటా 10-15 శాతం ఫీజు పెంచుతోందని గుర్తుచేశారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు పన్ను పేరిట డీజిల్‌పై లీటర్‌కు రూ.1.22 పైసలు పెంచి భారం వేసిందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *