Jai surya news గిరిజన గూడేలకూ ఇంటర్‌నెట్‌ - Jaisurya News

గిరిజన గూడేలకూ ఇంటర్‌నెట్‌

134 ఏజెన్సీ గ్రామాల్లో శరవేగంగా ఫైబర్‌ నెట్‌ పనులు

ఇందుకోసం రూ.3 కోట్లు జమ చేసిన సర్కారు

మరో 251 గ్రామాల్లో సేవలందించేందుకు రూ.24.50 కోట్లు

అమరావతి: రాష్ట్రంలోని ప్రతి గిరిజన గూడేనికీ ఇంటర్‌నెట్‌ సౌకర్యం కలగనుంది. కొండకోనల మధ్య ఉండే గిరి శిఖర గ్రామాలకు సైతం ఇంటర్‌నెట్‌ సేవల్ని అందించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టింది. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ నిర్వహణకు ఇంటర్‌ నెట్‌ తప్పనిసరి కావడంతో ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రతి గిరిజన గ్రామానికీ ఈ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది.

134 గూడేల్లో వేగంగా పనులు
ఇప్పటికే 134 గిరిజన గూడేల్లో ఫైబర్‌ నెట్‌ కనెక్టివిటీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం రూ.3 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌కు ఇప్పటికే చెల్లించింది. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 51 గ్రామాలు, విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 49 గ్రామాలు, విశాఖపట్నం జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో 26 గ్రామాలు, శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో 6 గ్రామాలు, చింతూరు, కేఆర్‌ పురం ఐటీడీఏల పరిధిలో ఒక్కో గ్రామంలో ఫైబర్‌ నెట్‌ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొండ ప్రాంతాల్లో ప్రభుత్వ సహకారంతో రిలయన్స్‌ సంస్థ 200కు పైగా టవర్స్‌ ఏర్పాటు చేసింది. వీటిద్వారా సమీప ఏజెన్సీ గ్రామాల్లో వైర్‌లెస్‌ ఇంటర్‌నెట్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో మరో 251 గూడేల్లోనూ..
ఫైబర్‌ నెట్‌ను ప్రతి గిరిజన గ్రామానికి విస్తరించే కార్యక్రమంలో భాగంగా 251 గూడేల్లో పనులు చేపట్టేందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఇందుకు రూ.24.50 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. త్వరలోనే నిధులు మంజూరవుతాయని, ఆ వెంటనే పనులు చేపడతామని అధికారులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *