Jai surya news విశాఖ’లో ట్రాఫిక్‌ ఇక్కట్లు తీరేలా ప్రత్యేక ప్రణాళికలు - Jaisurya News

విశాఖ’లో ట్రాఫిక్‌ ఇక్కట్లు తీరేలా ప్రత్యేక ప్రణాళికలు

45 కి.మీ మేర ‘హరిత మార్గం’

రాబోయే 30 ఏళ్లకు తగినట్లు ‘ప్రజా రవాణా’ వ్యవస్థవి

విశాఖపట్నంనగరమా... ఊపిరిపీల్చుకో!!

రోడ్డుపైకి వస్తే… అంతా హడావుడే ఎటు వెళ్లాలన్నా ట్రాఫిక్‌ పద్మవ్యూహమే ఎక్కడ చూసినా గజిబిజి… గందరగోళం!
కీలక మార్గాల్లో ఎక్కడైనా ఓ చోట ఒక్క వాహనం ఆగిపోతే… ఆ దారంతా ఇక్కట్లే ఇక్కట్లు!
ఈ బాధలకు తోడు.. కాలుష్య బెడద!
ఈ పరిస్థితులన్నీ మారాలన్నది ప్రభుత్వ లక్ష్యం!
అందుకే పలు శాఖ అధికారులంతా కలిసి ఒకే వ్యూహంతో ముందుకు వెళుతున్నారు!
నగరంలో జనం ప్రశాంతంగా ప్రయాణించేలా చేయడమే ప్రధాన ధ్యేయంగా రవాణా వ్యవస్థల్లో మార్పులు చేస్తున్నారు. ‘రాజధాని’ ప్రకటన నేపథ్యంలో ఈ పనులకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

ట్రాఫిక్‌పై.. కలిసికట్టుగా..: నగరంలో ట్రాఫిక్, ప్రజారవాణాపై 2014-15లో ప్రత్యేకంగా సర్వే నిర్వహించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్లు దానికి అదనంగా మరిన్ని ప్రణాళికలు జోడిస్తున్నారు. రాబోయే 30 ఏళ్లలో నగరంలోని అవసరాలు, పర్యాటకుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్‌ అడ్డంకుల్ని తొలగించేలా పోలీసు, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ విభాగాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. జాతీయ రహదారిపై మార్పులతో పాటు అంతర్గతదారుల విస్తరణకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. నగర అవసరాల్లో ఈ ప్రక్రియకు తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. వీఎంఆర్‌డీఏ (విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ) రూపొందిస్తున్న మాస్టర్‌ప్లాన్‌లో జీవీఎంసీ(మహా విశాఖ నగర పాలక సంస్థ), పోలీసుల్నీ భాగం చేశారు.

నగరమా... ఊపిరిపీల్చుకో!!
 సైకిళ్లపై కార్యాలయానికి:
నగర వాసుల జీవన శైలి ఇకపై నడక, సైకిళ్లపై ఎక్కువగా ఉండేలా జీవీఎంసీ ప్రణాళికలు చేస్తోంది. కార్యాలయాలకు, షాపింగ్‌కి సైతం సైకిళ్లపైనే వెళ్లొచ్చేలా రహదారులుండాలని యోచిస్తున్నారు. ప్రత్యేకించి జనసాంద్రత ఎక్కువగా ఉన్న జోన్‌-2, 3 ప్రాంతాల్లో ఈ అలవాటు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. విస్తరించాల్సిన దారులపై సర్వేచేస్తున్నారు.

కోస్టల్‌బ్యాటరీ నుంచి భీమిలి వరకూ 27 కి.మీ. మేర ప్రత్యేకించి సైకిల్‌ ట్రాక్, నడకబాటల్ని ప్రతిపాదించారు. ఇది సాగర తీరానికి చెంతగా సాగుతుంది. పర్యాటకులకు కూడా ప్రత్యేక ఆకర్షణ.

సెంట్రల్‌ పార్కు నుంచి వీఎంఆర్‌డీఏ మీదుగా…

జగదాంబ నుంచి పాండురంగాపురం బీ హార్బర్‌పార్క్‌ నుంచి ఆర్‌కేబీచ్‌…ఇలా వేర్వేరు దారుల్లో మరో 18 కి.మీ. మేర సైకిల్,  నడకబాటలు రానున్నాయి. ప్రస్తుతం హార్బర్‌పార్క్‌ నుంచి  ఆర్‌కేబీచ్‌ వరకూ పనులు కొనసాగుతున్నాయి.
మార్పులు.. అలా వచ్చినవే!
తాజాగా జనాభా పెరుగుదల, రాజధాని ప్రకటన నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకునే ప్రజారవాణాలో మార్పులు చేశారు. మెట్రోను గాజువాక నుంచి పొడిగిస్తూ స్టీల్‌ప్లాంట్, అనకాపల్లి దాకా తీసుకెళ్లారు. కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం దాకా పొడిగించారు. జాతీయ రహదారిపై నాలుగు పైవంతెనలు, బీచ్‌రోడ్డులో ట్రామ్‌ ప్రతిపాదనలూ ఇలా వచ్చినవేనని అధికారులు చెబుతున్నారు.
సవాళ్లపై చర్చ: బీ అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారిపై దృష్టిపెరగడంతో నగరం మీదుగా వెళ్తున్న ఎన్‌హెచ్‌-16ని జాతీయ రహదారుల ప్రాధికారసంస్థ అంతగా పట్టించుకోవడంలేదు. జీవీఎంసీకి అప్పగించే ప్రక్రియలోనూ జాప్యం జరుగుతోంది.

అనకాపల్లి, గంగవరం పోర్టు తదితర ప్రాంతాల్లోని ఆర్‌అండ్‌బీ రహదారుల నిర్వహణ కూడా దారుణంగా ఉంది. వీటినీ జీవీఎంసీకి అప్పగించే విషయమై చర్చ జరుగుతోంది. జీవీఎంసీమీదుగా వెళ్తూ ఇతర శాఖల ఆధీనంలో ఉండే ఇలాంటి రహదారుల్లో సమస్యలు తలెత్తుతుండటంతో వాటిని స్వాధీనం చేసుకునే దిశగా జీవీఎంసీ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

నగరమా... ఊపిరిపీల్చుకో!!
సులభతర ప్రయాణం కోసం…ట్రాఫిక్‌ అడ్డంకులన్నీ తొలగాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మొదటి ప్రాధాన్యంగా ప్రతి సమావేశంలో చెబుతూనే ఉన్నారు. ఇందులో భాగంగానే బహత్తర ప్రణాళిక(మాస్టర్‌ప్లాన్‌) రూపకల్పనలో జీవీఎంసీ సూచనల్నీ పొందు పరుస్తున్నారు. ప్రజారవాణాని సులభతరం చేయాలనేదే మా లక్ష్యం.

-డాక్టర్‌ జి.సృజన, జీవీఎంసీ కమిషనర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *