ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేతపై స్టే

సుప్రీంకోర్టు ఆదేశం

ఛార్జ్‌ మెమో ఇవ్వకుండానే ఇన్నాళ్లు సస్పెన్షనా?
రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి సుప్రీం ప్రశ్న
వెంటనే ఛార్జ్‌ మెమో అందజేయాలని ఆదేశాలు

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ మాజీ విభాగాధిపతి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను హైకోర్టు ఎత్తివేయడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఏ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ ఆదేశాలిచ్చింది. ఐపీఎస్‌ అధికారిని సస్పెండ్‌ చేసినప్పుడు ముందుగా అతనికి ఛార్జ్‌ మెమో ఎందుకు అందజేయలేదని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. వెంటనే ఆయనకు ఛార్జ్‌ మెమో ఇవ్వాలని ఆదేశించింది. టెండర్ల ప్రక్రియలో అవినీతి చోటు చేసుకున్నందునే ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందని ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది ఉదయ్‌సింగ్‌ చెప్పారు. ఆయనకు ఛార్జ్‌ మెమో అందించకుండా ఇంతకాలం సస్పెన్షన్‌ను ఎలా కొనసాగించారని ధర్మాసనం ప్రశ్నించింది. సస్పెన్షన్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని ఉదయ్‌సింగ్‌ తెలపగా ఆ ఉత్తర్వులు చూపించాలని ఆదేశించింది. పిటిషనర్‌ తరపు న్యాయవాది ఆదినారాయణరావు జోక్యం చేసుకొంటూ.. 30 ఏళ్ల సర్వీసులో ఏబీ వెంకటేశ్వరరావు ఒక్క మెమో అందుకోలేదని, తన పనితీరుతో ప్రెసిడెంట్‌ మెడల్‌, విశిష్ట సేవా పతకం వంటివి అందుకున్నారని తెలిపారు. ఆయన రాజకీయ బాధితునిగా మారారని మీరు భావిస్తున్నారా అని ధర్మాసనం ప్రశ్నించగా.. అవునని ఆదినారాయణరావు బదులిచ్చారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేసి ఎటువంటి పోస్టింగ్‌ ఇవ్వలేదని తెలిపారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి, నిఘా పరికరాలకు సంబంధించిన అంశమైనందున హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది ఉదయ్‌సింగ్‌ ధర్మాసనాన్ని కోరారు. స్టే ఇవ్వవద్దని ఆదినారాయణరావు విన్నవించారు. ధర్మాసనం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు ఏబీ వెంకటేశ్వరరావుకు మూడు వారాలు, దానిపై సమాధానం దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరో వారం గడువిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *