వైఎస్సార్‌ చేయూత, ఆసరా మహిళలకు నేడు పశువుల పంపిణీ

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

మూడు జిల్లాల్లోని 400 గ్రామాల్లో పాలను విక్రయించిన లబ్ధిదారులకు నగదు చెల్లింపులు..

అమూల్‌ కార్యకలాపాలను కూడా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

దశలవారీగా 4.69 లక్షల పశువుల యూనిట్ల పంపిణీ 

అమరావతి: వైఎస్సార్‌ చేయూత, ఆసరా మహిళలకు పశువుల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్నారు. దీంతోపాటు అమూల్‌ కార్యకలాపాలను కూడా ఆయన ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పశువుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోని 400 గ్రామాల్లో పాలను విక్రయించిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి నగదును పంపిణీ చేస్తారు.

ఎన్నికల సమయంలో పశుపోషకులకు ఇచ్చిన హామీని అమలు పరచడంలో భాగంగా పాలసేకరణ, మార్కెటింగ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన అమూల్‌తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం తెలిసిందే. ఈ నెల 5వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు లక్ష యూనిట్లు, అలాగే వచ్చే ఏడాది ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరిల మధ్య 3.68 లక్షల పాడిపశువుల యూనిట్లను దశలవారీగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సీఎం జగన్‌ను కలసిన అమూల్‌ ఎండీ సోధి
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గుజరాత్‌ కోపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (అమూల్‌) ఎండీ ఆర్‌.ఎస్‌.సోధి మంగళవారం కలిశారు. సీఎం జగన్‌ నివాసంలో ఈ భేటీ జరిగింది. సోధితోపాటు కైరా మిల్క్‌ యూనియన్‌(అమూల్‌ డెయిరీ) ఎండీ అమిత్‌ వ్యాస్, సబర్‌కాంత మిల్క్‌ యూనియన్‌ (సబర్‌ డెయిరీ) ఎండీ డాక్టర్‌ బీఎం పటేల్‌ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *