బీమా సొమ్ము ఎప్పుడు కడితే మీకేంటి?

శాసనసభలో తెదేపా సభ్యులను ప్రశ్నించిన ముఖ్యమంత్రి
అమరావతి: ‘పంటల బీమాకు సంబంధించిన ప్రీమియం మేము కడతామా? కట్టమా? ఎప్పుడు కడతాం.. అనే విషయాలు తెదేపాకు ఎందుకు? గతంలోనే కలెక్టర్ల సదస్సులో, ఇటీవల మంత్రివర్గ సమావేశంలోనూ ప్రకటించినట్లు గతేడాది ఖరీఫ్‌కు సంబంధించిన పంటల బీమా పరిహారం మొత్తం రూ.1,227 కోట్లు డిసెంబరు 15న ఆయా రైతుల ఖాతాలో పడతాయా? లేదా? చూడండి’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. బీమా పరిహారం చెల్లింపునకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు బీమా కంపెనీల భాగస్వామ్యం ఉంటుందని.. ఈ మూడింటి మధ్య అనుసంధానత పూర్తయిందని చెప్పారు. ఈ నెల 15న డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిసి కూడా ప్రీమియం కట్టలేదంటూ తెదేపా రచ్చ చేస్తోందని ధ్వజమెత్తారు. శాసనసభలో పోడియం వద్ద తెదేపా సభ్యులు నిరసన తెలుపుతున్న సమయంలో ఆయన మంగళవారం ఈ అంశంపై మాట్లాడారు. ‘జగన్ చెబితే చేస్తాడన్న విశ్వసనీయత ప్రజల్లో ఉంది. అదే చంద్రబాబు చెబితే కచ్చితంగా చేయడనేది ఆయనపై ఉన్న విశ్వసనీయత. 18 నెలలుగా ఫలానా తేదీన ఫలానా పథకం అమలు చేస్తామని చెప్పి చేయని పరిస్థితి ఉందా? అలాగే డిసెంబరు 15న పంటల బీమా పరిహారం చెల్లిస్తామని ముందే చెప్పాం. అయినా చంద్రబాబు ఇక్కడికి వచ్చి మేము ప్రీమియం కట్టలేదని పదేపదే విమర్శిస్తున్నారు. వీలైతే ప్రతిపక్షంగా సలహాలివ్వాలి. అలాకాకుండా చర్చే జరగనివ్వొద్దు.. బిల్లులే పెట్టనివ్వొద్దు అన్నట్లు వ్యవహరిస్తున్నారు’ అని జగన్ అన్నారు.
టిడ్కో ఇళ్లపై చర్చ ఇష్టం లేదు
‘టిడ్కో ఇళ్లపై చర్చించడం తెదేపాకు ఇష్టమే లేదు. జగన్ పథకం ముద్దా? చంద్రబాబు పథకమా? అని టిడ్కో లబ్ధిదారులను అడిగితే కనీసం పది మంది చంద్రబాబు పథకం కావాలని కోరలేదు. అందరూ జగన్ పథకమే ముద్దు అని తేల్చారు. ఈ అంశంపై చర్చకు ఇష్టం లేకనే పార్టీ సభ్యులందర్నీ పోడియం వద్దకు చంద్రబాబు పంపిస్తున్నారు’ అని జగన్ వ్యాఖ్యానించారు.
బీమా పరిధిలోకి 58.77 లక్షల రైతులు
‘తెదేపా హయంలో ఏడాదికి సగటున 20 లక్షల మంది రైతులకు మాత్రమే బీమా ప్రీమియం చెల్లించేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక 2019-20లో 58.77 లక్షల మంది రైతులను బీమా పరిధిలోకి తెచ్చాం. 2018కి సంబంధించిన పరిహారం రూ.415 కోట్లను 2019 అక్టోబరులో ఇచ్చాం. చంద్రబాబు హయాంలో ప్రీమియం మొత్తం ఎక్కువగా ఉండటంతో రైతులు నిరాసక్తి చూపేవారు. వారు ప్రీమియం చెల్లించినా ఏడాది తర్వాతే పరిహారం వచ్చేది. మా ప్రభుత్వమే రైతుల తరఫున ప్రీమియం చెల్లిస్తోంది. రైతులు వారీ వాటాగా రూపాయి చెల్లిస్తే చాలు.. రూ.1,030 కోట్లు ప్రీమియం కట్టాం. తెదేపా హయాంలో 2016-17లో రూ.228 కోట్లు, 2017-18లో రూ.535 కోట్లు, 2018-19లో రూ.415 కోట్లు మాత్రమే ప్రీమియం కట్టారు’ అని జగన్ వివరించారు.