సీఎం రహస్య ఎజెండాతో వ్యవహరించారు

వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది ప్రసాద్‌
రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ

ఆ చట్టాలు దురుద్దేశంతో తెచ్చారుఅమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ప్రభుత్వం దురుద్దేశంతో తెచ్చిందని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎమ్మెస్‌ ప్రసాద్‌ హైకోర్టులో వాదించారు. రాజధానితో ముడిపడిన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం రోజువారీ తుది విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. మంగళవారం నాటి విచారణలో పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ గుంటూరు జిల్లాకు చెందిన ఎ.శ్రీనివాసరావు, మరో ముగ్గురు, అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు వేసిన వ్యాజ్యాలపై సీనియర్‌ న్యాయవాది ఎమ్మెస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు.

కమిటీ నివేదికలకు ముందే సీఎం ప్రకటనా?
‘అమరావతి రాజధానిగా ఉండాలని పలు రాజకీయ పార్టీలు హైకోర్టులో అఫిడవిట్లు వేశాయి. జగన్‌ సీఎం అయ్యాక అమరావతిలో అభివృద్ధి పనులన్నింటిని ఆపేశారు. రాజధానిని తరలించాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌, ఉన్నతస్థాయి మంత్రుల కమిటీలు నివేదికలు ఇచ్చాయి. ఈ నివేదికలు రాకముందే మూడు రాజధానులపై ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించారు. దీని వెనుక దురుద్దేశం, రహస్య అజెండా ఉన్నాయి’ అని వాదించారు. ‘రహస్య అజెండా అని ఎలా చెబుతార’ంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ‘దురుద్దేశం ఏమిటో పిటిషన్లో పేర్కొనకుండా మౌఖికంగా చెప్పడం సరికాదు. మీరు చెబుతోంది ముఖ్యమంత్రి ప్రవర్తన (కండక్ట్‌) గురించి మాత్రమే. దాన్ని దురుద్దేశంగా ఎలా అంటార’ని ప్రశ్నించింది. న్యాయవాది ప్రసాద్‌ వాదనలు కొనసాగిస్తూ.. ‘రాజధాని అభివృద్ధికి రైతుల నుంచి వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించి ఒప్పందం చేసుకుంది. దాన్నుంచి వైదొలగడానికి వీల్లేద’ని చెప్పారు.

అది విశ్వాస ఘాతుకమే న్యాయవాది జీవీఆర్‌ చౌదరి
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో న్యాయవాది జీవీఆర్‌ చౌదరి వాదనలు వినిపించారు. ‘రాష్ట్రానికి మధ్యలో ఉండేలా అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికనూ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ప్రభుత్వం పాలన వికేంద్రీకరణ, మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులంటూ గందరగోళం సృష్టిస్తోంది. రాజ్యాంగం ప్రకారం దీనికి వీల్లేదు. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం ఎలా చెబుతుంది?’ అని వాదించారు. ధర్మాసనం స్పందిస్తూ.. వివిధ రాష్ట్రాల్లోనూ శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒక నగరంలో.. హైకోర్టు మరో చోట ఉన్నాయి కదా అని గుర్తుచేసింది. ‘చారిత్రాత్మక కారణాలుంటే హైకోర్టు వేరేచోట ఏర్పాటు చేయడంలో తప్పులేదు. కాని, అమరావతిలో మూడు వ్యవస్థలూ ఉండాలని గతంలోనే నిర్ణయం జరిగింది’ అని న్యాయవాది గుర్తు చేశారు. రైతుల భూముల తీసుకొని రాజధానిని తరలిస్తామనడం విశ్వాస ఘాతుకమేనని వాదించారు. మూడు రాజధానులకు అనుమతిస్తే భవిష్యత్తులో ఇంకొకరు అధికారంలోకి వచ్చాక మరోచోట ఏర్పాటు చేస్తామంటారు. ఈ అంశాల్ని పరిగణించి పాలన వికేంద్రీకరణ చట్టాల్ని రద్దు చేయాల’ని కోరారు.
* మరికొందరి పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా చట్టాలు చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. చట్టబద్ధ పాలనకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ విచారణలన్నీ బుధవారానికి వాయిదా పడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *