8వ తేదీన భారత్‌ బంద్‌  

కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన ఆందోళన మరింత తీవ్రం కానుంది. ఈ నెల 8వ తేదీన భారత్‌ బంద్‌ పాటించాలని రైతు సంఘ నాయకుడు హర్వీదర్‌ సింగ్‌ లడ్క్‌వాల్‌ పిలుపునిచ్చారు. ‘‘కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరాము. ఐదో తేదీన దేశవ్యాప్తంగా ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేస్తాము. డిసెంబర్‌ 8వ తేదీన భారత్‌ బంద్‌ పాటించాలని పిలుపునిస్తున్నాము’’ అని భారతీయ కిసాన్‌ యూనియన్‌ లోఖోవాల్‌ జనరల్‌ సెక్రటరీ హర్వీదర్‌ సింగ్‌ తెలిపారు. ఆయన ఆంగ్ల వార్త సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు.

దేశ రాజధాని సరిహద్దుల్లో అన్నదాతలు చేపట్టిన ఆందోళన వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. రైతుల నిరసనతో కొవిడ్‌ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున వారిని వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. న్యాయవాది ఓం ప్రకాశ్‌ పరిహార్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తిన సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన నేటితో తొమ్మిదో రోజుకు చేరింది. కొత్త చట్టాలపై రైతు సంఘాలు, కేంద్రం ఇప్పటికే రెండు విడతల్లో చర్చలు జరిపినప్పటికీ అవి కొలిక్కిరాలేదు. దీంతో చర్చలను శనివారానికి వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *