RRR’: కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ వచ్చేశాడు!

‘‘వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ.. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ. నా తమ్ముడు గోండు బెబ్బులి. కొమురం భీమ్’’ అంటూ తారక్ పాత్రను రామ్‌చరణ్ పరిచయం చేశారు. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ లుక్ అభిమానులను కట్టిపడేసింది. ఇక తెరపై ఎన్టీఆర్ నట విశ్వరూపం చూడటమే ఆలస్యం.
కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభం కాగా, షూటింగ్ మొదలైన వెంటనే ఎన్టీఆర్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించి, ప్రత్యేక వీడియోను విడుదల చేస్తామని దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. గురువారం తాజా వీడియోను రామ్‌చరణ్ అభిమానులతో పంచుకున్నారు. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని తొలుత చెప్పినా, అభిమానులను కాస్త ఊరించి 11.30గం.లకు విడుదల చేశారు.