ఆస్తి పన్ను భారమే

ఖర్చుల పెరుగుదలకు అనుగుణంగా యూజర్ ఛార్జీలు
పట్టణ స్థానిక సంస్థల్లో సంస్కరణలకు రాష్ట్రం
అంగీకరించిందన్న కేంద్రం
అందుకే రూ.2,525 కోట్ల అదనపు రుణ సేకరణకు అనుమతి
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయని కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ఇందులో భాగంగా పట్టణాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న సర్కిల్ రేట్లకు అనుగుణంగా ఆస్తి పన్ను ఫ్లోర్ రేట్లను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. ప్రస్తుత ఖర్చులు/గత ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబించేలా తాగునీటి సరఫరా, డ్రైనేజీ, మురుగునీటి ఛార్జీలను నిర్ణయిస్తుంది. ధరల పెరుగుదలకు అనుగుణంగా ఆస్తి పన్ను, యూజర్ ఛార్జీల ఫ్లోర్ రేట్లను క్రమం తప్పకుండా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది…’’ అని వెల్లడించింది. ‘పట్టణ స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి, మెరుగైన వైద్య, పారిశుద్ధ్య సేవలు అందించేలా చేయడమే ఈ సంస్కరణల లక్ష్యం. ఆర్థికంగా పునరుజ్జీవం పొందిన పట్టణ స్థానిక సంస్థలు పౌరులకు మంచి మౌలిక సౌకర్యాలు సృష్టించగలుగుతాయి. వీటిని విజయవంతంగా పూర్తి చేయడంలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌లు ముందడుగు వేశాయి. ఈ సంస్కరణలతో రాష్ట్రాలకు అదనపు రుణ అనుమతులను ముడిపెట్టాం. దాంతో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,525 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.2,373 కోట్ల మేర బహిరంగ మార్కెట్ నుంచి అదనంగా రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చామని’ వివరించింది.