అందరికీ ఇళ్ల లక్ష్యం దిశగా..గొప్ప ప్రయాణం

పీఎంఏవై (పట్టణ) పథకం అమల్లో రాష్ట్రం ముందంజ

2022 నాటికి లక్ష్యాన్ని పూర్తి చేస్తాం
అర్హులందరికీ ఇళ్ల పట్టాలిచ్చాం
మహిళ పేరు మీదనే రిజిస్ట్రేషన్‌
ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌ ఎంపికను గౌరవంగా భావిస్తున్నాం
ప్రధాని మోదీతో వర్చువల్‌ సమావేశంలో సీఎం జగన్‌ వెల్లడి

అమరావతి :2022 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ప్రయాణం చేస్తోందని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే అర్హులైన వారందరికీ 100% ఇళ్ల పట్టాలిచ్చామని తెలిపారు. 67% ఇళ్లనూ మంజూరు చేశామన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల పట్టాలు, ఇళ్లను లబ్ధిదారులైన మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేస్తున్నామని… మహిళా సాధికారతకు, వారి ఆర్థిక భద్రతకు ఇది దోహదపడుతుందని చెప్పారు. పీఎంఏవై (పట్టణ) పథకం అమల్లో ఉత్తమ ప్రతిభ చూపిన రాష్ట్రాల కింద ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.గ్లోబల్‌ హౌసింగ్‌ టెక్నాలజీ ఛాలెంజ్‌ (జీహెచ్‌టీసీ)- ఇండియా కింద ఆరు లైట్‌ హౌసింగ్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమంతోపాటు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ), ఆశా-ఇండియా అవార్డుల కార్యక్రమాలను శుక్రవారం వర్చువల్‌ విధానంలో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ, సీఎం జగన్‌తోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. పీఎంఏవై పట్టణ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో ఏపీ మూడో ర్యాంకు, బెస్ట్‌ ప్రాక్టీస్‌ ఇన్నోవేషన్‌ ప్రత్యేక విభాగంలో ప్రాజెక్టు మానిటరింగ్‌, టూల్స్‌ వాడుతున్నందుకు రెండో ర్యాంకు, ఇదే విభాగంలో ఉత్తమ సాంకేతికను వినియోగిస్తున్నందుకు మూడో ర్యాంకు, ఉత్తమ సమర్థత చూపిన నగరపాలక సంస్థ విభాగంలో మొదటి ర్యాంకు సాధించిన గ్రేటర్‌ విశాఖకు ప్రధాని మోదీ అవార్డులు ప్రదానం చేశారు. వాటిని ముఖ్యమంత్రి జగన్‌ అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘974 కి.మీ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తుపాన్లు, భారీ వర్షాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా పేదలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.  గృహనిర్మాణ రంగంలో సుస్థిర, పర్యావరణ హితమైన, విపత్తులను తట్టుకునే సాంకేతికను గుర్తించేందుకు గ్లోబల్‌ హౌసింగ్‌ టెక్నాలజీ ఛాలెంజ్‌ను ప్రధాని ప్రారంభించడం అభినందనీయం’ అని అన్నారు.

షెడ్యూల్‌ ప్రకారం పూర్తి
‘2022 నాటికి అందరికీ ఇళ్లు అందించాలన్నది ప్రధాని మోదీ లక్ష్యం. రాష్ట్రానికి కేంద్రం 20.21 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. దీనికి అదనంగా 8.95 లక్షల ఇళ్లను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంజూరు చేయగా, ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12,410 కోట్లను హడ్కో, ఇతర సంస్థల ద్వారా రుణాలు తీసుకునేందుకు అనుమతిచ్చారు. అందరికీ ఇళ్ల లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఇవి తోడ్పడతాయి. చక్కటి ప్రణాళిక, నిర్మాణాల్లో సరైన విధానాలు అనుసరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉంది. క్షేత్రస్థాయిలో ఇబ్బందులను అధిగమించడానికి మొత్తం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించాం. 2022 నాటికి నిర్దేశించుకున్న షెడ్యూల్‌ ప్రకారం వీటిని పూర్తి చేస్తాం’ అని జగన్‌ పేర్కొన్నారు.

ఇళ్లు కట్టించి, మౌలిక వసతులు కల్పిస్తున్నాం
‘పీఎంఏవై (పట్టణ) పథకం అమల్లో రాష్ట్రం ముందు వరుసలో సాగుతోంది. పట్టణ ప్రాంత పేదల్లో చాలా మందికి ఇళ్ల స్థలాలు లేవు. ఇలాంటి వారికోసం రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాం. 25,433 ఎకరాల ప్రభుత్వ భూమి సహా 68,677 ఎకరాలను ప్లాట్లుగా మార్చి పేదలకు పంపిణీ చేశాం. ఆర్థికంగా వెనుకబడ్డ వారి కోసం పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో 16,098 కాలనీలను అభివృద్ధి చేస్తున్నాం. ఇళ్లు కట్టించడమే కాదు.. రహదారులు, మురుగుకాల్వలు, తాగునీరు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఇందుకోసం రూ.12,410 కోట్లు ఖర్చు చేస్తున్నాం. కొవిడ్‌ కారణంగా మందగించిన ఆర్థిక వ్యవస్థకు.. ఈ ఇళ్ల నిర్మాణంతో మంచి ఊతం లభిస్తుంది. 30 రకాల పనులు చేసుకుంటున్న వారికి భారీగా ఉపాధి లభించనుంది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఇది వీలు కల్పిస్తుంది’ అని అన్నారు.
మోదీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు
సమావేశంలో రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రధాని మోదీ సహా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ముఖ్యమంత్రి జగన్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది 130 కోట్ల భారతీయుల్లో సుఖ, సంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కొవిడ్‌ విపరిణామాల నుంచి దేశం కోలుకుని ఆర్థికంగా ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *