సింహగిరిపై వైభవంగా కూడారై ఉత్సవం

విశాఖ ,సింహాచలం : సింహగిరిపై జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం కూడారై ఉత్సవం వేడుకగా జరిగింది. అర్చకులు స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలు, పలువర్ణాల పుష్పాలతో అలంకరించి బేడామండపం తిరువీధి నిర్వహించారు. గోదాదేవి అమ్మవారి సన్నిధి ఎదురుగా స్వామిని ఉంచి విశేష పూజలు నిర్వహించారు. తిరుప్పావై పాశుర విశేషాన్ని అనుసరించి నేతితో తయారు చేసిన పాయసాన్ని స్వామికి నివేదించారు.
* సింహాచలం కొండ దిగువన దేవస్థానం ఉప దేవాలయం శ్రీవేంకటేశ్వరస్వామి కోవెలలో కూడా కూడారై వైభవంగా జరిగింది. పాశుర విశేషాన్ని అనుసరించి 108 కలశాల్లో నెయ్యితో తయారు చేసిన పాయసాన్ని నింపి స్వామికి నివేదించారు. గోదాదేవి అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.