కాకులకు… ఏమైంది..?

కలెక్టరేట్లో ఆరు మృతి
కారణాలపై పశుసంవర్థక శాఖ ఆరా
విశాఖ : కలెక్టరేట్లో నిమిషాల వ్యవధిలో ఆరు కాకులు మృతి చెందడం కలకలం రేపింది. పశుసంవర్ధక శాఖ అధికారుల బృందం హుటాహుటిన కలెక్టరేట్‌కు చేరుకొని కారణాలపై అన్వేషణ ప్రారంభించింది. ఇటీవల నగరంలో డీఆర్ఎం కార్యాలయం, ఎన్ఎడీ కూడలి వద్ద రెండు రోజుల వ్యవధిలో రెండు కాకులు మృతి చెందాయి.ఇందుకు బర్డ్‌ఫ్లూ కారణం కాదని అధికారులు నిర్ధరించారు. ఈ ఘటన మరువక ముందే కలెక్టరేట్లో సోమవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో కాకులు మృతి చెందాయి. ఒకటి చెట్ల కొమ్మపై, మరో నాలుగు నీళ్లు లేని కాలువ పక్కన మృతిచెందగా, వాటి చెంతనే మరోకాకి లేవలేని స్థితిలో ఉంది. దానికి చికిత్స అందించేందుకు తీసుకెళ్లిన కొద్దిసేపటికే మృతి చెందింది. కాకులు హఠాత్తుగా కింద పడిపోయి, నిమిషాల వ్యవధిలో మృతి చెందాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చనిపోయే ముందు కొద్దిసేపు కొట్టుమిట్టాడాయని పేర్కొన్నారు. విద్యుత్తు తీగలు తాకిన ఆధారాలు లేవు.కాకి కళేబరాన్ని పరిశీలిస్తున్న పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ రామకృష్ణ, శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.నాగమణి, ఇతర బృంద సభ్యులు
పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ డి.రామకృష్ణ, జంతు వ్యాధి నిర్ధారణ ల్యాబొరేటరీ (ఏడీడీఎల్)కి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.నాగమణి ఆధ్వర్యంలో ఒక బృందం.. మృతి చెందిన కాకులను కవర్లలో భద్రపర్చి శవ పరీక్షల కోసం తరలించారు. కాకులు మృతి చెందిన ప్రదేశంలో ప్రత్యేక ద్రావణం పిచికారీ చేసి శుభ్రం చేశారు.
ఇన్ఫెక్షన్ వల్లే మృతి : ఇన్ఫెక్షన్ కారణంగా కాకులు మృతి చెందాయని ఏడీడీఎల్ శాస్త్రవేత్త డాక్టర్ నాగమణి వెల్లడించారు. మృతి చెందిన వాటికి పశువుల ఆసుపత్రి ఆవరణలో ఉన్న తమ ల్యాబ్‌లో పరీక్షలు చేశామన్నారు. బర్డ్‌ఫ్లూ అవశేషాలు ఏమీ కనిపించలేదన్నారు. తాగేనీరు, ఆహారంలో కలుషితం కారణంగా మృతి చెందినట్లు నిర్ధారణ అయిందన్నారు. పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ డి.రామకృష్ణ మాట్లాడుతూ…ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించానన్నారు. తమ శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తమయిందన్నారు. 43 కమిటీలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తున్నామన్నారు.
పక్షులు చనిపోతే సమాచారం ఇవ్వండి
జంతు ప్రదర్శనశాల క్యూరేటర్ నందినీ సలారియా
విశాఖపట్నం : దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు బయటపడడంతో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జంతుప్రదర్శనశాల క్యూరేటర్ నందినీ సలారియా పేర్కొన్నారు. పక్షులు వైరస్ బారిన పడకుండా తరచూ వైరస్ నివారణ మందులు పిచికారీ చేస్తున్నామన్నారు. పక్షులు మృతిచెందిన ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే సమచారం ఇవ్వాలని చెబుతున్నామన్నారు.