ఆదాయం పక్కదారి పడుతోంది?

సంపత్‌ వినాయక ఆలయ నిర్వహణపై ఫిర్యాదులు

దేవాదాయశాఖ అధికారుల విచారణ

దస్త్రాలను తనిఖీ చేస్తున్న సహాయ కమిషనర్‌ శాంతి

విశాఖపట్నం : ఆశీల్‌మెట్టలోని సంపత్‌ వినాయక ఆలయం నిర్వహణ సరిగా లేదని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దీంతో జిల్లా సహాయ కమిషనర్‌ కాళింగిరి శాంతి సోమవారం ఆలయంలో పరిశీలించారు. పలు దస్త్రాలను తనిఖీ చేశారు.  ఈ ఆలయాన్ని నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఆదాయ లెక్కల ప్రకారం 6ఏ కేటగిరిలో ఉంది. సహాయ కమిషనర్‌గా ఉన్న అధికారి దీనికి ఈవోగా వ్యవహరిస్తారు. కొన్నేళ్లపాటు ఇలా కొనసాగగా… మూడేళ్ల కిందట ఈవో లేకుండా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. ఆ తరువాత నిర్వహణ గాడి తప్పిందనే ఫిర్యాదులు అందాయి.
ఆ వ్యవస్థ లేకపోవడంతో
భక్తులు కానుకలు సమర్పించేందుకు ప్రత్యేక వ్యవస్థ లేక ఆదాయం పక్కదారి పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి.
వాహన పూజ, అభిషేకం, హోమాలకు ప్రత్యేక టిక్కెట్లు లేకపోవడంతో వాటికి చెల్లించాల్సిన డబ్బులు కొందరి జేబుల్లోకి వెళుతున్నాయని…
ఆనందపురం మండలం గండిగుండం వద్ద దేవస్థానానికి చెందిన ఆరు ఎకరాల స్థలాన్ని ఇతరులకు అప్పగిస్తున్నారని…
నైవేద్యం తయారీ వంటశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని…
నిత్య అన్నదానంలో సామాన్య భక్తులకు అవకాశం ఇవ్వకుండా కొందరికి మాత్రమే అనుమతిస్తున్నారని…ఫిర్యాదు అందాయి. అలాగే ఇక్కడ నడుస్తున్న వృద్ధాశ్రయం… ఆలయానికి సీతమ్మధారలో ఉన్న ఇంటి అంశంపైనా వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేపట్టినట్లు సహాయ కమిషనర్‌ శాంతి చెప్పారు. దస్త్రాలు తనిఖీ చేశామన్నారు. దర్యాప్తు నివేదికను కమిషనర్‌కు పంపుతామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *