గట్టు దాటేలోగా.. గుట్టు తేలాలి..

నేడు, రేపు సాగర్‌ కవచ్

‌విశాఖ ,అచ్యుతాపురం :విశాలమైన సాగర తీరం విశాఖ జిల్లా సొంతం. దేశ రక్షణలో కీలకమైన ఎన్నో సంస్థలు ఇక్కడే కొలువై ఉన్నాయి. ఇతర దేశాల నుంచి శత్రువులు మన నేలపై అడుగుపెట్టడానికి సాగర తీరాన్ని మార్గంగా మార్చుకుంటారనే కఠోర వాస్తవం ముంబయి దాడులతో వెల్లడైంది. అప్పటి నుంచి ప్రభుత్వం మెరైన్‌ పోలీసు స్టేషన్ల ద్వారా తీర గ్రామాల్లో గస్తీ పెంచింది. ఈ గస్తీ ఎంత కట్టుదిట్టంగా ఉంటోందనే విషయం సమీక్షించడానికి సాగర్‌ కవచ్‌ పేరిట ప్రతిష్ఠాత్మకంగా ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టనున్నారు.

తీరరక్షణపై కేంద్ర రక్షణ బలగాలు, రాష్ట్ర పరిధిలో పనిచేసే పోలీసులు ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సాగర్‌ కవచ్‌ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాయి. రాష్ట్ర పోలీసులతోపాటు నేవీ, తీర రక్షణదళం, కేంద్ర కస్టమ్స్‌ అండ్‌ ఎక్సైజ్‌, హోంశాఖకు చెందిన అధికారులు దీనిని పక్కాగా నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈనెల 12, 13 తేదీల్లో రెండురోజుల పాటు తీరప్రాంతాల్లో ఈ మాక్‌డ్రిల్‌ నిర్వహించనున్నారు.

నిర్వహణ ఇలా: తీవ్రవాదులు తీరంగుండా భూభాగంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించాలని భావిస్తే ఏవిధంగా ఎదుర్కోవాలి అనేది ప్రత్యక్షంగా తెలుసుకోవడమే సాగర్‌ కవచ్‌ లక్ష్యం. తీర ప్రాంతాలు కలిగిన రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఏటా రెండుసార్లు అన్ని రక్షణ విభాగాలకు చెందిన అధికారులు ఈ మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తుంటారు. తీరరక్షణ దళం, నేవీ సిబ్బంది ముందురోజు తీవ్రవాదుల వేషధారణతో సముద్ర జలాల్లోకి వెళ్తారు. వీరు జిల్లాలో ఏదో ఒక మూలన ఉన్న తీరానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. వీరు తీరానికి చేరుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేలోగా పోలీసులు, మెరైన్‌ సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది.

పట్టుకోవాల్సింది ఇలా: తీవ్రవాదుల వేషధారణలో వచ్చే రక్షణ సిబ్బంది భూభాగంలోకి రాకుండా తీరం ఒడ్డున గస్తీ నిర్వహించడంతోపాటు పడవల్లో అన్వేషించడం, వాహనాలు తనిఖీ చేయడం వంటి కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహిస్తారు. నిజమైన తీవ్రవాదులను పట్టుకోవడానికి పోలీసులు, రక్షణాదళం సిబ్బంది ఎంతస్థాయిలో ప్రయత్నిస్తారో అంతేస్థాయిలో ఈ నమూనా ప్రదర్శన నిర్వహిస్తారు. దీనిని చూసే ప్రజలకు మాత్రం తీవ్రవాదులు నిజంగానే ప్రవేశించారా? అన్న అనుమానం కలగక మానదు. తీర ప్రాంతంలోని ప్రతి నియోజకవర్గంలోనూ 60 మందికి తక్కువగాకుండా పోలీసులు ఈ కవచ్‌లో పాల్గొననున్నారు. అన్ని విభాగాలకు చెందిన అధికారులు సోమవారం సమీక్ష సమావేశాలు నిర్వహించి సిబ్బందికి, అవగాహన కల్పించారు.

బృందాలుగా పోలీసుసిబ్బందితో నిఘా

– నారాయణరావు, సీఐ, ఎలమంచిలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సాగర్‌ కవాచ్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం. ఎలమంచిలి నియోజకవర్గంలో ఉన్న తీర ప్రాంతాలతోపాటు పాయకరావుపేట పరిధిలోనూ కవాచ్‌ను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాం. రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల పరిధిలో తీరప్రాంతాన్ని ఆనుకొని పోలీసులు, మెరైన్‌ పోలీసులను బృందాలగా ఏర్పాటు చేశాం. వాహనాలు తనిఖీతోపాటు తీరంలో రక్షణ ఏర్పాట్లును పర్యవేక్షణ చేస్తున్నాం. 60మంది పోలీసు సిబ్బందిని ఈ విధుల్లో ఉంచాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *