ఆధార్‌ ఓటీపీ రాకపోతే కష్టమే!

టీకా వేయాలంటే ఇది రావాల్సిందే

ఆధార్‌-మొబైల్‌ అనుసంధానమే కీలకం

అమరావతి: రాష్ట్రానికి వచ్చిన కొవిడ్‌ టీకాను అర్హులకు వేయడంలో ‘కొవిన్‌’ యాప్‌ కీలకం. ఇప్పటివరకు మూడుసార్లు నిర్వహించిన ‘డ్రై రన్‌’ ద్వారా ఈ యాప్‌ వేగం తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టీకా పొందే వారి సెల్‌ఫోన్లకు సంక్షిప్త సమాచారం వస్తుంది. ఏ కేంద్రానికి, ఎప్పుడు రావాలో అందులో ఉంటుంది. దీని ప్రకారమే కేంద్రాలకు రావాలి. అయితే, కరోనా టీకా వేయించుకునేవారి సెల్‌ఫోన్‌ నంబర్లు ఆధార్‌తో అనుసంధానం కావడం తప్పనిసరి. టీకా ఒకరికి బదులు మరొకరికి వేయకుండా చూసేందుకే ఈ విధానాన్ని పాటిస్తున్నారు. ఆధార్‌ కార్డుకు అనుసంధానమైన సెల్‌ఫోన్‌ నంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్‌ చేశాకే ఇతర వివరాలు నమోదయ్యేలా యాప్‌ రూపొందించారు. చాలామందికి ఆధార్‌ కార్డులున్నా వాటికి సెల్‌ఫోన్‌ నంబరు అనుసంధానం కాలేదు. అలాంటివారికి ఓటీపీ రాదు. దీనిపై అవగాహన ఉన్నవారు ఇప్పుడిప్పుడే ఆధార్‌ కార్డుకు సెల్‌ఫోన్‌ నంబరును అనుసంధానం చేయించుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ పరంగా ఏమైనా సమస్యలొస్తే.. పుస్తకాల్లో వివరాలు నమోదుచేసి, టీకా పంపిణీ సజావుగా నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కేంద్రాన్ని కోరింది. ఒకేసారి కోట్లమందికి టీకాలిచ్చే ప్రక్రియలో ఎలాంటి సమస్యలు వస్తాయోనన్న ఆందోళన అధికారుల్లో ఉంది. సమస్యలు వస్తే లబ్ధిదారులను గంటలకొద్దీ క్యూలైన్లలో నిల్చోబెట్టడం కష్టం కావొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *