4 నెలల్లో విశాఖకు?

  • పాలనా రాజధాని తరలింపు దిశగా అడుగులు
  • నిమ్మగడ్డ డిక్టేటర్‌.. ఫ్యాక్షనిస్టు: సజ్జల

అమరావతి : విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు దిశగా నాలుగైదు నెలల్లో అడుగులు పడతాయని భావిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారమిక్కడ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అధికార వికేంద్రీకరణలో భాగంగా విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ అని నిర్ణయం తీసుకున్నాం. కోర్టుల్లో కేసుల వల్ల ఆలస్యమవుతోంది. ఒక నెలా, అటో ఇటో వెళ్లడం ఖాయం. వచ్చే మూడేళ్లలో వికేంద్రీకరణ ఫలాలు రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం చూపించాలి. ఈ మేరకు కోర్టుల్లో వాదనలు నిలబడేలా చేస్తాం. వచ్చే నాలుగైదు నెలల్లో వెళ్తామని అనుకుంటున్నాం’ అని సజ్జల తెలిపారు. విశాఖకు కృష్ణా బోర్డు తరలింపుపై మాట్లాడుతూ.. పరిపాలన కార్యకలాపాలు ఎక్కడుంటాయో ఇవీ అక్కడకే వస్తాయన్నారు.

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెనుక దురుద్దేశాలు ఉన్నాయి కాబట్టే హైకోర్టు తగిన తీర్పునిచ్చిందని అన్నారు. ఎన్నికల ప్రొసీడింగ్స్‌ టీడీపీ తయారు చేసినట్లుగా ఉందని చెప్పారు. ‘ఆలయాలపై దాడులు ఆగిన వెంటనే ఎన్నికల వ్యవహారం తెరపైకి రావడం అనుమానాస్పదంగా ఉంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిలా నిమ్మగడ్డ వ్యవహారశైలి లేదు. డిక్టేటర్‌లా ఉంది. ఎస్‌ఈసీ నుంచి అధికారుల తొలగింపు ఉద్యోగులను బెదిరించేలా ఉంది. ఆయన ఫ్యాక్షనిస్టులా ప్రవర్తిస్తున్నారు’ అని ఆరోపించారు. రాష్ట్రంలో మతసామరస్యం బ్రహ్మాండంగా ఉందని, అవాంఛనీయ సంఘటనల వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని చెప్పారు. విగ్రహాలు ధ్వంసం చేసి ప్రజల్ని రెచ్చగొట్టాలని కుట్రలు చేస్తున్నారని.. ఆ కుట్రలను ఛేదిస్తామని తెలిపారు. రాజకీయ శక్తుల ప్రమేయంతోనే దాడులు చేస్తున్నారని, ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయన్నారు. కులాలను..

మతాలను రాజకీయాల్లోకి లాగవద్దని.. దేవుళ్లతో ఆటలాడుకోవాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. నీచమైన రాజకీయాలకు కేరాఫ్‌ టీడీపీ అని విమర్శించారు. ముఖ్యమంత్రిపై బురదజల్లేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని.. దుష్టశక్తులన్నీ ఏకమై ప్రజా సంక్షేమానికి అడ్డుతగులుతున్నాయని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *