నా సర్వీసులో ఇలాంటి వ్యాఖ్యలు వినలేదు

ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

అమరావతి: దేవాలయాలపై దాడులకు సంబంధించి ఊహాగానాలు, పుకార్లు రేకెత్తించినా సామాన్యులు సంయమనంతో వ్యవహరించారని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ఈ సమయంలో పోలీసులపై వచ్చిన విమర్శలను ఆయన ఖండించారు. తన సర్వీసులో పోలీసులపై ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ వినలేదన్నారు. పోలీసులు కులాలు, మతాలకు అనుగుణంగా కాకుండా రాజ్యాంగానికి లోబడే పనిచేస్తారని తెలిపారు.

బుధవారం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

2020లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని, కరోనా సమయంలో రాత్రింబవళ్లు కష్టపడి పని చేశామని డీజీపీ వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 58,871 ఆలయాలకు జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేశామన్నారు. 43,824 సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై సమాచారం ఇవ్వాలని,  ఆలయాలపై ప్రత్యేకంగా 93929 03400 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని డీజీపీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *