కోడిపందేలపై కరోనా దెబ్బ

అమరావతి: ఏటా ఖాకీపై కోడి గెలిచింది అనేమాట వినిపించేది. ఈసారి సంక్రాంతికి కో‘ఢీ’, కోవిడ్‌ అనే చర్చసాగుతోంది. పోలీస్‌ ఆంక్షల నడుమ సంక్రాంతి మూడురోజులు కోడిపందేలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది కోడిపందేలకు కరోనా వైరస్‌ కూడా సవాలు విసురుతోంది. సంక్రాంతి మూడురోజులపాటు నిర్వహించే కోడిపందేలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి వందలాది కుటుంబాలు జీవిస్తుంటాయి. కోడి కత్తులు తయారు చేసేవారు, కోడి పుంజులకు కత్తులు కట్టేవారు, పందేల కోసం బరుల ఏర్పాటుకు కూలీలు.. వందలాది మందికి ఉపాధి దొరుకుతుంది. కేవుల్‌ (కమిషన్‌) తీసుకుని ఏర్పాట్లు చూసే నిర్వాహకులు ఈ మూడురోజుల కోసం ఏడాదంతా ఎదురుచూస్తారు.

కోడిపందాలు, పేకాట, గుండాట, కోతాట జీవనోపాధిగా మలుచుకున్న అనేకమందికి ఆ మూడురోజులు పండుగే. దీనికితోడు కోడిపందేలు, కోతాట, గుండాట బరుల వద్ద పెద్ద ఎత్తున స్టాల్స్‌ (తాత్కాలిక షాపులు) ఏర్పాటు చేస్తారు. కూల్‌ డ్రింక్స్‌ షాపు నుంచి సిగరెట్‌ షాపులు, పలావు సెంటర్లు, కోడిమాంసం పకోడి దుకాణాలు, ఇతరత్రా మాంసాహారాలు దొరికే హోటళ్లు, అల్పాహార కేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం స్థలం అద్దె, అనుమతి ఇచ్చినందుకు నిర్వాహకులకు రోజువారీ చెల్లింపులుగా పెద్ద మొత్తాలు ఇస్తుంటారు. ఇలా ఉభయ గోదావరితోపాటు పలు జిల్లాల్లో వందలాది కుటుంబాలకు ఉపాధి, వేలాదిమందికి జూదకాంక్ష, లక్షలాదిమందికి కనువిందు కలిగించే కోడిపందేలకు ఈసారి కోవిడ్‌ పెనుసవాలు విసురుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *