పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్న చంద్రబాబు

మంత్రి బొత్స సత్యనారాయణ

విజయనగరం : పోలవరం ప్రాజెక్ట్‌ను, రాజధాని పేరు చెప్పి అమరావతిని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏనాడూ రైతుల గురించి ఆలోచించని చంద్రబాబుకు ఇప్పుడు అకస్మాత్తుగా రైతులు గుర్తుకు రావటం విడ్డూరమన్నారు. ప్రజలు ఎందుకు ఓడించారో ఆలోచించడానికి చంద్రబాబుకు 20 నెలలు పట్టిందని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అంటూ ఐదేళ్లపాటు ప్రజల్ని మోసగించారని, చంద్రబాబు ఇచ్చిన 650 బూటకపు హామీలను నమ్మి మోసపోయిన ప్రజలు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. సీఎం జగన్‌పై కడుపు మంటతోనే చంద్రబాబు పండగ సంప్రదాయాన్ని వదిలి విషం చిమ్ముతున్నారన్నారు. పండుగ పూట ప్రజలకు శుభాకాంక్షలు చెప్పాల్సిన మనిషి శాపనార్థాలు పెట్టడం మంచిది కాదని హితవు పలికారు. ప్రజల్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు వేషాలు వేస్తున్నారని, ఆ గాలి మనిషి ఎన్ని గాలి కబుర్లు చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.

మాన్సాస్‌ను కుటుంబ వ్యవహారంలా మార్చేశారు
విజయనగరంలోని మాన్సాస్‌ ట్రస్ట్‌పై చంద్రబాబుకు అవగాహన లేదని, ఆ సంస్థ కార్యకలాపాలను అశోక్‌గజపతిరాజు కుటుంబ వ్యవహారంగా మార్చేశారని బొత్స ధ్వజమెత్తారు. వారి కుటుంబ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు. అశోక్‌ గజపతిరాజు 2004లోనే తన అన్న ఆనంద గజపతిరాజును చైర్మన్‌గా తొలగించి, సంస్థను విలీనం చేయాలని కోరారని గుర్తు చేశారు. మాన్సాస్‌ ఆధ్వర్యంలో మెడికల్‌ కళాశాల నిర్మిస్తామని చెప్పి అటకెక్కించిన విషయం జిల్లా ప్రజలకు తెలుసన్నారు. మెడికల్‌ కళాశాల నిర్మిస్తామన్న స్థలాన్ని మాజీ ఎంపీ మురళీమోహన్‌ వ్యాపార నిర్వహణకు కట్టబెట్టారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *