రెవెన్యూ కోడ్‌ తీసుకురండి!

రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నతస్థాయి కమిటీ సూచన

కొత్త ఉద్యోగులకు మార్గదర్శకత్వం ఉండటం లేదు
రెవెన్యూ చట్టాలపై అందరికీ అవగాహన తప్పనిసరి
భూ పరిపాలన తీరుపై సమగ్ర అధ్యయనం

అమరావతి :రాష్ట్రంలో భూ పరిపాలన వ్యవహారాలను చక్కదిద్దేందుకు రెవెన్యూ కోడ్‌ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రభుత్వానికి సూచించింది. భూ పరిపాలన వ్యవహారాలకు సంబంధించి తీసుకునే ప్రతి చర్య గురించి అందరికీ తెలిసేలా ఈ కోడ్‌ను రూపొందించాలంది. ఉద్యోగులు, ముఖ్యంగా కొత్తగా విధుల్లోనికి వచ్చిన వారు సందేహం వస్తే… సహచర ఉద్యోగులను సంప్రదించి దస్త్రాలపై ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేసింది. ఇలా జరగకుండా ప్రతి ఒక్కరికీ చట్టాలు, ప్రభుత్వం జారీచేసే ఉత్తర్వులు, జరిగే మార్పుల గురించి క్షుణ్ణంగా అవగాహన వచ్చేలా రెవెన్యూ కోడ్‌ విధానాన్ని ఉత్తరప్రదేశ్‌లో మాదిరిగా అమలులోకి తేవాలంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1991లో రెవెన్యూ కోడ్‌ కోసం ప్రయత్నం జరిగినా కార్యరూపం దాల్చలేదని గుర్తు చేసింది.

భూ పరిపాలన, నీటి నిర్వహణ, భూహక్కులు(ల్యాండ్‌ టైటిలింగ్‌), రీ-సర్వే సమస్యలపై అధ్యయనం చేసేందుకు 2020 సెప్టెంబరులో విశ్రాంత ఐఏఎస్‌ ప్రేమచంద్రారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని వేసింది. ఈ కమిటీ తాను గుర్తించిన లోపాలు, వాటి పరిష్కార మార్గాలు చూపుతూ 39 పేజీల నివేదికను ఇటీవల సమర్పించింది. నిషిద్ధ భూముల చట్టం ప్రామాణికత-రిజిస్ట్రేషన్‌ చట్టంలోని 22ఏ ప్రకారం ఏయే భూములను రిజిస్ట్రేషన్‌ చేయకూడదో స్పష్టంగా పేర్కొంది. ఎటువంటి భూములను ఏయే సబ్‌క్లాజుల కింద నిషిద్ధ భూముల జాబితాలోకి చేర్చాలో స్పష్టతనిచ్చింది. ఈ కమిటీ నివేదికలోని ముఖ్యాంశాలపై జాగ్రత్తగా ఉండాలని జిల్లా అధికారులకు రెవెన్యూ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

రికార్డుల నిర్వహణలో లోపాలతో సమస్యలు
భూరికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. అనధికారికంగా, న్యాయవిరుద్ధంగా రికార్డుల్లో మార్పులు జరిగిపోతున్నాయి. ఒకే కాలంలో, ఒకే భూమి వేర్వేరు వ్యక్తుల స్వాధీనంలో ఉన్నట్లుగా నమోదవుతోంది. ఇది కొందరు మోసగాళ్లకు ఊతం ఇస్తోంది. భూరికార్డులను అక్రమ మార్గాల్లో తారుమారు చేయడంతో ప్రభుత్వం గత కొన్నేళ్లలో చాలా విలువైన భూములను కోల్పోయింది. కొన్నిసార్లు అవి ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నప్పటికీ, వాటికి సంబంధించి రెవెన్యూ అధికారులు జారీచేసిన రికార్డులు విరుద్ధంగా ఉండటంతో… అవి ప్రభుత్వ భూములేనని కోర్టుల్లో నిరూపించలేని పరిస్థితి తలెత్తుతోంది.

షరతు లేకున్నా రిజిస్ట్రేషన్లు జరగడంలేదు
1954లో జూన్‌ 18న జారీచేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేదలకు అందచేసిన భూములను బదిలీ చేయకూడదని షరతు పెట్టింది. అయితే… ఈ నిబంధన అమలులోకి రాకముందు ఇచ్చిన అసైన్డ్‌ పట్టాలను కూడా రిజిస్ట్రేషన్‌ చేయడంలేదు. వీటిని పదేళ్ల తర్వాత నిషిద్ధ జాబితా నుంచి తప్పించాల్సి ఉన్నా… మార్పు జరగడంలేదు.

అసైన్డ్‌ భూముల్లో ఇదీ సమస్య
ఏపీ అసైన్డ్‌ ల్యాండ్స్‌ (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్స్‌) చట్టం-1977ను 2019లో సవరించారు. దీని ప్రకారం అసైన్డ్‌ భూమిని లబ్ధిదారులు 20ఏళ్ల అనంతరం అమ్ముకోవచ్చని అనుమతిచ్చారు. ఇప్పటికే గడువు పూర్తయిన వారి పేర్లను నిషిద్ధ జాబితా నుంచి తప్పించాలి.

ప్రభుత్వ భూములకూ విశ్వసనీయత లేదు
వందేళ్ల క్రితం రూపొందించిన ఆర్‌ఎస్‌ఆర్‌ (రీసెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌)లో పోరంబోకు, బంజరు, అన్‌ అసెస్డ్‌ వేస్ట్‌ భూములు, ప్రభుత్వ స్వాధీన భూములు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భూములున్నాయి. వీటిని పేదలకు ఇచ్చినా, విక్రయించినా ఆ వివరాలను ‘ఆర్‌ఎస్‌ఆర్‌’లో నమోదు చేయడంలేదు. ఫలితంగా కొన్నిచోట్ల ప్రభుత్వ భూములకు విశ్వసనీయత పోయింది.

ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ రుణాలతో కొనుగోళ్లు
ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు ఇచ్చే రుణాలతో భూముల కొనుగోలుకు అవకాశం ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం రుణాలు చెల్లించేవరకు వీటిని అమ్మొద్దు. చెల్లింపు పూర్తయితే…నిషిద్ధ జాబితా నుంచి వాటిని తప్పించవచ్చు.

గమనిక: మాజీ సైనికోద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధులు/రాజకీయ బాధితులు…

* 1963 ఏప్రిల్‌ 30న జారీచేసిన జీఓ 743 ఉత్తర్వుల ప్రకారం మాజీ సైనికోద్యోగులు ప్రభుత్వం కేటాయించిన భూమిని పదేళ్లపాటు అనుభవించిన అనంతరం కలెక్టర్‌ అనుమతితో విక్రయించుకోవచ్చు. 1993 నవంబరు 11న జారీచేసిన ఉత్తర్వుల్లో ‘పదేళ్లు- ప్రభుత్వ అనుమతి’ అనే నిబంధనను తొలగించారు. అయితే… ఈ ఉత్తర్వు ఇప్పటికీ సరిగా అమలవడంలేదు.
* స్వాతంత్య్ర సమరయోధులు/రాజకీయ బాధితులకు ఇచ్చే భూములను అసైన్డ్‌ పట్టాలుగా నమోదు చేస్తూ… వీటిని బదిలీ చేయకూడదని పేర్కొంటున్నారు. అయితే… పదేళ్ల గడువును పరిగణనలోనికి తీసుకోని వాటికి బదిలీ అవకాశం కల్పించాలి. సవరించిన జాబితాను సబ్‌రిజిస్ట్రార్లకు పంపాలి. రాజకీయ బాధితులకు ఇచ్చే పట్టాల విషయంలో మాజీ సైనికోద్యోగులకు అమలుచేసే నిబంధనలే వర్తిస్తాయి. మార్కెట్‌ విలువల ప్రకారం హక్కుదారులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఈ భూములు సైతం నిషిద్ధ జాబితాలోనే ఉంటున్నాయి. వీటిని నిషిద్ధ జాబితా నుంచి తప్పించాలి.
* ప్రభుత్వం స్వాధీనం చేసుకునే భూముల వివరాలను రికార్డుల్లో అప్‌డేట్‌ చేయాలి. రికార్డుల స్వచ్ఛీకరణలో సర్వే నెంబర్ల వారీగా వీటిని పరిశీలించాలి.
* అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన భూములను వారసత్వంగా మాత్రమే అనుభవించాలి. బదిలీ చేయకూడదు. ఈ వివరాలతో జాబితా సిద్ధంచేయాలి.
* ఆర్‌ఎస్‌ఆర్‌లోని కాలం-16 (పట్టాదారు) ప్రకారం చుక్కలు పెట్టిన వాటిని చుక్కల భూములుగా పరిగణిస్తున్నారు. వీటిపై 2017లో ఏపీ డాటెడ్‌ ల్యాండ్స్‌ (అప్‌డేషన్‌ ఇన్‌ రీసెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌) చట్టాన్ని తెచ్చారు. దీని ప్రకారం ‘ఆర్‌ఎస్‌ఆర్‌’లో చుక్కల భూములకు సంబంధించి హక్కుదారుల వివరాలు నమోదై ఉంటే వాటిని 21ఏ జాబితా నుంచి తప్పించాలి. 22ఏ (1) (ఇ) కింద పెట్టిన చుక్కల భూముల్లో ప్రభుత్వం లబ్ధిదారులకు మంజూరుచేసినవి ఉంటే….వాటిని 22ఏ 1 (ఏ) కింద మార్చాలి. చుక్కల భూములపై తమకే హక్కులు ఉన్నాయని తగిన ఆధారాలు చూపిస్తే… 2017 చట్టం ప్రకారం నిషిద్ధ జాబితా నుంచి తప్పించాలి.
* పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామకంఠ భూములనూ నిషిద్ధ జాబితా నుంచి తప్పించాలి.
* జమీందారులు/రాజులు తమకు అందించిన సేవలకు గుర్తుగా భూములను కొందరికి కేటాయించారు. వీటిని ఇనాం(గిఫ్ట్‌) భూములుగా పేర్కొంటున్నారు. 1956 చట్టాన్ని అనుసరించి మంజూరుచేసిన రైత్వారీ పట్టాలను నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలి.
* ఎస్టేట్‌ భూములకు సంబంధించి సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అడంగళ్‌ను ప్రామాణికంగా తీసుకోవాలి. ఇందులో వ్యక్తిగతంగా లేదా సంస్థల పేర్లతో వివరాలు నమోదై ఉంటే… వాటిని ప్రైవేట్‌ భూములుగా పరిగణించాలి. వీటిల్లో వివాదాల్లో ఉండే భూముల విషయంలో ఎస్టేట్‌ అబాలిషన్‌ చట్టంలోని నిబంధనలు అనుసరించాలి. ఫెయిర్‌ అడంగళ్‌లో నమోదైన ఉన్న వారి భూములను 22ఏ నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలి.
* ఆంధ్రప్రదేశ్‌ ఎస్టేట్స్‌ (అబాలిషన్‌ అండ్‌ కనవర్షన్‌ ఇన్‌టూ రైత్వారీ) చట్టం-1948, ఏపీ ఇనామ్స్‌ (అబాలిషన్‌ అండ్‌ కన్‌వర్షన్‌ ఇన్‌టూ రైత్వారీ) చట్టం-1956 చట్టాలను వివాదాలను పరిష్కరించాలి.
* క్లెయిమ్‌ వాస్తవమే అయినా ఆధారాలు లేకపోవడంతో పై చట్టాల ప్రకారం న్యాయం చేయాలంటూ అభ్యర్థనలు ఎప్పుడు వచ్చినా అధికారులు పరిష్కరించాల్సి వస్తుంది. అలాకాకుండా వాటికి కాలపరిమితి విధించాలి. ఆధారాలు లేని దరఖాస్తుల్లోని సమాచారం క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, తిరస్కరిస్తే..ఎందుకు తిరస్కరించాలో ఆ వివరాలను సంబంధితులకు తెలియబరచాలి.
* డాక్యుమెంట్లు ఉన్న అసైన్‌మెంట్‌ భూములు మాత్రమే 22-ఎలో చేర్చాలి. సాక్ష్యాలు సమర్పించాల్సిందిగా సంబంధిత పార్టీల్ని కోరటం సరికాదు.

అవసరం లేకున్నా నిషిద్ధ జాబితాలోనికి…

* కొన్ని ప్రైవేటు భూముల్ని కూడా అవసరం లేకపోయినా నిషిద్ధ జాబితాలో చేర్చినట్టు దృష్టికి వచ్చింది. ఇది వివిధ కోర్టుల్లో భారీ సంఖ్యలో కేసులు పేరుకుపోవడానికి కారణమవుతోంది. దానివల్ల చాలామంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు భూముల విషయంలో ప్రస్తుతం చేస్తున్న తప్పుల్ని సరిదిద్దుకునేందుకు, భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చూడాలి.
* నేషనల్‌ లిటిగేషన్‌ పాలసీ-2010 ప్రకారం ప్రభుత్వం భూముల పరిపాలన విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఉద్దేశపూర్వకంగా భూములను వివాదాస్పదం చేసే వారిని ఉపక్షేంచకూడదు. సంయుక్త కలెక్టర్‌ (రైతు భరోసా-రెవెన్యూ) కోర్టుల్లో పెండింగులో ఉండే కేసుల వివరాలను ప్రతినెలా సమీక్షించాలి. ఇంజక్షన్‌ ఆర్డర్లు జారీ కాకుండా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.

బాధ్యతలు గుర్తెరిగి పని చేయాలి

నిషిద్ధ భూముల జాబితా తయారీ బాధ్యత కలెక్టర్లతోపాటు ఏఏ స్థాయిలో ఉన్న అధికారులకు ఉంటుందో కమిటీ వివరించింది. వీటిపై తగిన శ్రద్ధపెట్టి చర్యలు తీసుకోవాలని సూచించింది.
* పట్టాదారులకు తెలియకుండా రెవెన్యూ అధికారులు పేర్లలో మార్పు, చేర్పులు చేయొద్దు. అవసరమైతే సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీచేసి, వారి విజ్ఞప్తిని పరిశీలించాలి. అడంగళ్‌, 1-బిలో మార్పులు చేయడానికి ఉన్నతాధికారులకు సైతం అధికారాలు లేవు.
*  కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా? లేవా? పరిశీలించాలి. అవసరాలకు అనుగుణంగా మార్పులు అవసరం అనుకుంటే చర్యలు తీసుకోవాలి.
* రెవెన్యూ కోర్టుల స్థానంలో రెవెన్యూ ట్రైబునళ్లను ఏర్పాటుచేయాలి. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలి. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ సమయంలోనే ఆఫీసుకు వచ్చేలా చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *