రాష్ట్రానికి చేరిన కొవాగ్జిన్

తొలుత కొవిషీల్డ్ పంపిణీ
332 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు
అమరావతి: రాష్ట్రానికి 20వేల డోసుల కొవాగ్జిన్ వ్యాక్సిన్ చేరింది. భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ విమానం ద్వారా విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి బుధవారం చేరుకుంది. దీన్ని సమీపంలో ఉన్న వ్యాక్సిన్ టీకాలను భద్రపరిచే కేంద్రానికి తరలించారు. మొదట విడత కింద 4,96,680 డోసుల వ్యాక్సిన్‌ను రాష్ట్రానికి పంపిస్తామని కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో మంగళవారం పుణెలోని సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ రాష్ట్రానికి చేరింది. 4,77,000 డోసులున్న 44 బాక్సులను బుధవారంనుంచి జిల్లాలకు పంపించారు. వీటిని జిల్లా అధికారులు స్వాధీనం చేసుకొని తగిన ప్రమాణాలతో భద్రపరిచారు.
అధిక శాతం కేంద్రాలు ప్రభుత్వాసుపత్రుల్లోనే..!
రాష్ట్రవ్యాప్తంగా 332 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాలు ఎక్కువగా ప్రభుత్వాసుపత్రుల్లోనే ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో వంద మందికిపైగా సిబ్బంది ఉంటేనే కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నారు. టీకా వేయడానికి అర్హుల ఎంపిక బాధ్యతను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు అప్పగించారు. కొవిషీల్డ్ టీకాలో ఒక్కో వాయిల్లో 10 డోసులు ఉంటాయి. ఒక్కసారి తెరిస్తే 4 గంటల్లోపే దాన్ని వినియోగించాలని కేంద్రం మార్గదర్శకాలున్నాయి. ఆయా కేంద్రాల్లో 16వ తేదీన ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు అర్హులకు వ్యాక్సినేషన్ చేయనున్నారు. ఈ నెల 16 నుంచి కొవిషీల్డ్ టీకాను మాత్రమే వేయనున్నారు. కొవాగ్జిన్ తక్కువగా వచ్చినందున వెంటనే వినియోగించడం లేదు. ప్రధాని మోదీ ఈ నెల 16న వ్యాక్సినేషన్‌ను లాంఛనంగా ప్రారంభించి ఎంపిక చేసిన కేంద్రాల్లో టీకా వేసుకునే వారితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. ఈ జాబితాలో ఏపీలోని అర్హులకు మాట్లాడే అవకాశం లభించలేదని దిల్లీ వర్గాలు తెలిపాయి.