లీటరు పెట్రోల్ ఏపీలో రూ.95

హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.91.96, డీజిల్ ధర రూ.85.89
వరుసగా ఐదో రోజూ పెట్రో బాదుడు
న్యూఢిల్లీ, అమరావతి : వాహనదారులపై ‘పెట్రో’ బాదుడు కొనసాగుతోంది. వరుసగా ఐదో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వరంగ చమురు కంపెనీలు పెంచాయి. శనివారం లీటరు పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 36 పైసలు పెంచాయి ఈ సంస్థలు. దీని ఫలితంగా హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.91.96కు, డీజిల్ ధర రూ.85.89కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధర రూ.95 దాటగా.. డీజిల్ ధర రూ.89కి చేరువలో ఉంది. రాష్ట్రంలోని చిత్తూరులో పెట్రోల్ ధర అత్యధికంగా లీటరుకు రూ.95.10, డీజిల్ ధర రూ.88.42 ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.94.20, డీజిల్ ధర రూ.87.64కు చేరుకుంది. ఇక న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి రూ.88.41కు, డీజిల్ ధర రూ.78.74కు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర రూ.95కు చేరువైంది. డీజిల్ ధర రికార్డు స్థాయిలో రూ.85.70కు చేరింది. ఈ వారంలో ఐదు రోజులు ఇంధనాల ధర పెరిగింది. పెట్రోల్ ధర రూ.1.51, డీజిల్ ధర రూ.1.56 పెరగడంతో వాహనదారుల చమురు వదులుతోంది. ధరల దూకుడు చూస్తుంటే త్వరలోనే లీటరు పెట్రోల్ ధర రూ.100ను చేరుకునే సంకేతాలు కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. డిమాండ్ ఊపందుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా దేశీయంగా ఇంధనాల ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 62.40 డాలర్ల స్థాయిలో కదలాడుతోంది. ఇంధనాలపై పన్నులు తక్షణమే తగ్గించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి.