Jaisurya News

పరేషన్‌

అల్లిపురం వెంకటేశ్వరమెట్ట వద్ద రేషన్‌బండి వద్ద కార్డుదారులు క్యూ

తెల్లకార్డుదారుల గగ్గోలు

పనులు మానేసి బియ్యం కోసం ఎదురుచూపులు

ఈపోస్‌ మిషన్‌కు సిగ్నల్‌ సమస్య

గంటల తరబడి వీధుల్లో క్యూలు

మహిళల్లో తీవ్ర అసంతృప్తి

20 రోజుల్లో 60శాతం దాటని పంపిణీ

విశాఖపట్నం : మాధవధారకు చెందిన భవానీశంకర్‌ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.  గతంలో ప్రతి నెలా ఒకటి నుంచి 15వ తేదీలోగా తనకు వీలున్నప్పుడు రేషన్‌ డిపోకు వెళ్లి సరకులు తీసుకునేవాడు. ఇంటింటికీ రేషన్‌ పంపిణీ మొదలైన తరువాత పని మానుకుని వ్యాన్‌ వద్దకు వెళ్లి వేచి ఉండాల్సి వస్తోంది.

హెచ్‌బీ కాలనీకి చెందిన వెంకటమహాలక్ష్మికి ఈ నెల మూడో తేదీన బియ్యం ఇస్తామని వలంటీర్‌ ఫోన్‌ చేశారు. అదేరోజు ఆమె బంధువు ఒకరు చనిపోవడంతో  వెళ్లలేకపోయింది. ఇప్పుడు వలంటీర్‌ను అడిగితే మీకు ఇచ్చిన సమయంలో సరకులు తీసుకోవాలి. తరువాత ఇస్తారా? అనేది నాకూ తెలియదు…అని సమాధానం చెప్పడంతో ఆమె ఆందోళన చెందుతోంది.

ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కార్యక్రమం అస్తవ్యస్తంగా మారింది. గత నెల వరకు కార్డుదారులు తమకు ఖాళీ వున్న సమయంలో రేషన్‌ డిపోలకు వెళ్లి బియ్యం, కందిపప్పు, పంచదార తెచ్చుకునేవారు. డీలర్లు ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు వరకు (కరోనా సమయంలో రాత్రి తొమ్మిది వరకు) డిపోలు తెరిచి ఉంచేవారు. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం మార్చేసింది. ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీ చేస్తామని ప్రకటించింది. అయితే ఒక పథకం అమలుచేసే ముందు తలెత్తే ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయలేదు. దీంతో ఆరంభంలో సమస్యలు మొదలయ్యాయి. పథకం మీద వాహనదారులకు అవగాహన లేకపోవడం, సర్వర్‌ పనిచేయకపోవడం, వలంటీర్‌-కార్డుదారుడి మధ్య మ్యాపింగ్‌ పక్కాగా చేయకపోవడంతో బియ్యం కోసం కార్డుదారులు నాపాట్లు పడుతున్నారు. డిపోల వద్ద గంటపాటు నిలబడితే సరకులు అందేవని, ఇప్పుడు గంటల తరబడి రోడ్లపై ఎండలో నిల్చోవాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు. ఇంటింటికీ రేషన్‌ పంపిణీ అంటే ఇబ్బందిలేకుండా ఇంటికే బియ్యం తెచ్చిస్తారని అనుకున్నామని, తీరా చూస్తే వీధి చివర గంటలకొద్దీ నిలబడాల్సి     … మిగతా 6వ పేజీలో

వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చక్కాగా డిపోకు వెళ్లి బియ్యం తెచ్చుకునేవారమని, ఇదేం తలనొప్పని ఈసడించుకుంటున్నారు. ఒకవేళ రేషన్‌ తీసుకోకపోతే మళ్లీ ఎప్పుడిస్తారనేది వాహనదారుడు, వలంటీర్‌ చెప్పలేకపోతున్నారు. దీంతో కొందరు కార్డుదారులు రేషన్‌ కోసం ఒకరోజు పని మానుకుంటున్నారు. గతంలో ఇటువంటి పరిస్థితి లేదని వారంతా వాపోతున్నారు. దీనికితోడు ధర ఎక్కువగా వుండడంతో అనేకమంది గతంలో కందిపప్పు కొనుగోలు చేసేవారుకాదు. ఇప్పుడు విధిగా బియ్యంతోపాటు కంది పప్పు, పంచదార కొనుగోలు చేయాల్సిందేనని వాహనదారులు తెగేసి చెబుతున్నారు. కాగా ప్రతి వలంటీర్‌కు తన పరిధిలో బియ్యం కార్డుతో మ్యాపింగ్‌ చేశారు. అయితే అనేకచోట్ల మ్యాపింగ్‌ సక్రమంగా జరగలేదు. ఇటువంటిచోట్ల కార్డుదారుడికి రేషన్‌ పంపిణీ చేయడం లేదు.   ఇలా ఈ నెలలో చాలా కుటుంబాలకు రేషన్‌ ఇవ్వలేదు. కాగా కొన్నిచోట్ల కార్డుదారుల వేలిముద్రలు పడడం లేదు. దీంతో వారిలో ఆందోళన మొదలైంది. ఇంకా సర్వర్‌ ప్రతిరోజు మొరాయించడం పరిపాటైంది. సిగ్నల్‌ అందకపోవడంతో పంపిణీలో మరింత జాప్యమేర్పడింది. కాగా ఫిబ్రవరి నెల 20వ తేదీ వచ్చినా నగరంలో 60 శాతం మందికి కూడా రేషన్‌ ఇవ్వలేకపోయారు. మిగిలిన కార్డులకు రేషన్‌ ఇవ్వాలంటే మరో పది రోజులు పడుతుందంటున్నారు.

ఇంత వరకు బియ్యం ఇవ్వలేదు

అప్పికొండ లక్ష్మి, శ్రీనగర్‌

ఫిబ్రవరి నెలలో మూడు వారాలు దాటింది. ఇంతవరకు రేషన్‌ ఇవ్వలేదు. ఇస్తామని వలంటీర్‌ చెబుతున్నాడు. ఇలాగైతే బతికేదెలా. గతంలో ప్రతినెలా తొలివారంలోనే బియ్యం తీసుకునేవాళ్లం. ఇంటికి రేషన్‌ అంటే ఎంతో సంబరపడ్డాం…తీరా చూసేసరికి ఇబ్బందులు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *