Jaisurya News

ఎగిసిన ఉక్కు పిడికిళ్లు

సాగర తీరాన కొనసాగుతున్న ఉద్యమం

విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం తెలిసిన వెంటనే ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం క్రమంగా ఉద్ధృత రూపం దాలుస్తోంది. రాష్ట్రంలోని ముఖ్య పార్టీల నేతలతో సహా అందరూ కార్మికుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. కర్మాగారం ప్రధాన గేటు వద్ద 2వారాల నుంచి ఉద్యోగులు, నిర్వాసితులు దీక్షా శిబిరాలను కొనసాగిస్తున్నారు. ఈనెల 26న రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు చేయటానికి కార్మిక సంఘాలు ఇప్పటికే నిర్ణయించాయి. ఉద్యమాన్ని విస్తృతం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాయి. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేలాది కార్మికులు ద్విచక్రవాహనాలు, కార్లపై ఉక్కు కర్మాగారం నుంచి విశాఖ వరకు ఈ నెల 5న నిర్వహించిన ర్యాలీ ఉద్యమాన్ని పతాక స్థాయికి చేర్చింది. తన పదవికి తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయడం ఉద్యమానికి మరింత ఊపునిచ్చింది. తెదేపా విశాఖ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరు రోజులపాటు చేసిన ఆమరణ నిరాహార దీక్షకు అపూర్వ స్పందన లభించింది. పోలీసులు ఆయన్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 16న విశాఖకు వచ్చి పల్లా శ్రీనివాసరావును పరామర్శించి ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తే తామూ ఒక్క నిమిషంలోనే రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఈ నెల 17న సీఎం జగన్‌ విశాఖ విమానాశ్రయంలో ఉక్కు ఉద్యోగ, కార్మిక సంఘాలు, పోరాట కమిటీ ప్రతినిధులతో గంటకుపైగా సమావేశమయ్యారు. కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్రం ప్రతిపాదనకు తాము వ్యతిరేకమని ప్రకటించారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశారు. వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 14 మంది పార్లమెంటు సభ్యులు కేంద్ర హోం, ఆర్థిక, ఉక్కు శాఖల మంత్రులను కలిసి విన్నపాలనిచ్చారు.
పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌ అధికారుల సంఘం ప్రతినిధులు కూడా దిల్లీ వెళ్లి ఉక్కు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులను, ఉక్కుశాఖ మంత్రిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. 18న ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభ కూడా ఉద్యమ తీవ్రతకు అద్దం పట్టింది. 20న వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పక్షం నుంచి ఆందోళనలు కొనసాగుతున్నా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన కనిపించ లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *