Jaisurya News

అనకాపల్లిలో మహిళా రాజ్యం

జీవీఎంసీ ఎన్నికల్లో ఐదు వార్డులూ మగువలకే రిజర్వు

‘విశాఖ’లో విలీనం తరువాత పట్టణంలో తొలిసారి ఎన్నికలు

ప్రచార రంగంలోకి అభ్యర్థినులు

అనకాపల్లి : విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) అనకాపల్లి జోన్‌ పరిఽధిలోని మొత్తం ఐదు వార్డులూ మహిళలకు రిజర్వు అయ్యాయి. పట్టణంలో పురుష ఓటర్లకన్నా మహిళా ఓటర్లు అధికంగా వుండడంతోపాటు జీవీఎంసీలో సగం వార్డులు మహిళలకు రిజర్వు కావడంతో అనకాపల్లి జోన్‌ మొత్తం అతివలకే రిజర్వు అయ్యింది. ఆయా ప్రధాన పార్టీలు గతంలోనే అభ్యర్థులను ఖరారు చేయడం, వచ్చే నెలలో ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కావడంతో వార్డుల్లో ప్రచారం మొదలైంది.  గ్రామీణ జిల్లా కేంద్రమైన అనకాపల్లి మునిసిపాలిటీ… 2013 జూలై 30వ తేదీన గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)లో విలీనమైంది. అంతకుముందు  చిట్టచివరి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా కడిమిశెట్టి వెంకట మహాలక్ష్మి పనిచేశారు. ఆ తరువాత ఎన్నికలు జరగలేదు. 2013లో అనకాపల్లి పట్టణంతోపాటు కొప్పాక, రాజుపాలెం, వల్లూరు, తాడి, సాలాపువానిపాలెం పంచాయతీలు జీవీఎంసీలో విలీనమయ్యాయి. జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు గత ఏడాది రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నగారా మోగించింది.  అనకాపల్లి జోన్‌లో ఐదు వార్డులు వుండగా, అన్నీ మహిళలకు రిజర్వు అయ్యాయి. వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌, సీపీఎంల నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఉపసంహరణ సమయంలో కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. కోవిడ్‌ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో తొలుత పంచాయతీ ఎన్నికలకు పచ్చజెండా ఊపిన ఎన్నికల కమిషనర్‌…. ఇవి పూర్తవుతుండడంతో మునిసిపల్‌ ఎన్నికలకు నగారా మోగించారు. గత ఏడాది ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిందో… అక్కడి నుంచే పునఃప్రారంభించారు. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు వార్డుల్లో ప్రచారాన్ని శ్రీకారం చుట్టారు. మహిళా అభ్యర్థులతోపాటు ముఖ్యనాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *