కొత్తవలస అంశంపై స్పందించిన చంద్రబాబు

విజయనగరం జిల్లా: కొత్తవలస పంచాయతీ ఫలితం వివాదంగా మారింది. టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు తొలుత ప్రకటించిన అధికారులు.. వైసీపీ అభ్యర్థి రీ కౌంటింగ్‌కు పట్టుబట్టిన తర్వాత ఫలితం మారిపోయింది. వైసీపీ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటించడంపై టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. తాజా పరిస్థితులపై కొత్త వలస మాజీ సర్పంచ్ గోరపల్లి రాముకు చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. న్యాయపోరాటం చేద్దామని చెప్పారు.
కొత్త వలస పంచాయతీ కౌంటింగ్‌లో మొదటి నుంచి టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగారు. ఆదివారం రాత్రి 10:30 గంటలకు టీడీపీ అభ్యర్థి 284 ఓట్ల మెజారిటీతో గెలుపొందారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అయితే మరి కాసేపటికి వైసీపీ అభ్యర్థి 10 ఓట్ల మెజారిటీతో గెలిచారని ప్రకటించడంతో అక్కడ గందరగోళం నెలకొంది.
విజయనగరం జిల్లాలోని ఆఖరి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల వెల్లడిలో అయోమయం నెలకొంది. గజపతినగరం, శృంగవరపుకోట నియోజకవర్గాల పరిధిలో జరిగిన పంచాయతీ ఎన్నికల పోరు కొత్త వివాదాలకు ఊతమిచ్చింది. అధికారులు అనేకచోట్ల అధికారపార్టీకి అనుకూలంగా పనిచేశారు. ఎక్కడా న్యాయంగా ఎన్నికలు జరగలేదని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.