Jaisurya News

ఫలితాల తారుమారుకు కుట్ర

మూడంకెల మెజారిటీ వచ్చినా రీకౌంటింగ్‌
వైసీపీ నేతలతో పోలీసులు, అధికారుల కుమ్మక్కు

ఎస్‌ఈసీకి రాసిన లేఖలో చంద్రబాబు ఆరోపణలు

అమరావతి : పంచాయతీ ఎన్నికల నాలుగో దశలో గెలిచిన వైసీపీయేతర అభ్యర్థులను ప్రకటించకుండా ఫలితాలు తారుమారు చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. రాత్రి 10గంటలకూ 40శాతం ఫలితాలు ప్రకటించలేదన్నారు. టీడీపీ మద్దతు అభ్యర్థులకు మూడంకెల మెజారిటీ ఉన్నా రీకౌంటింగ్‌ చేశారని, వైసీపీ నేతలతో పోలీసులు, అధికారులు కుమ్మక్కై, ఫలితాలపై ప్రభావం చూపారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫలితాల ప్రకటనలో జాప్యం, అధికారుల అన్యాయాలు, వైసీపీ అక్రమాలపై ఆదివారం రాత్రి ఎస్‌ఈసీకి చంద్రబాబు రెండు లేఖలు రాశారు. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ‘స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలపై ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు చేశాం. అయినా అక్రమాలపై, రాజ్యాంగ ఉల్లంఘనలపై ఎలాంటి చర్యలు లేవు. 4వ దశ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలు బలపర్చిన అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచినా, ఫలితాలు దాచి, రాత్రి 8గంటల తర్వాత వైసీపీ బలపర్చినవారికి అనుకూలంగా ప్రకటనలు వెలువరిస్తున్నారు. గత 3దశలతో పాటు 4వ విడతలోనూ అలాంటి ఘటనలే వెలుగుచూశాయి.

చీకటి పడిన తర్వాత ఫలితాల తారుమారులో పోలీసులు, ఎన్నికల విధుల్లోని అధికారులు వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల తరఫున ఈ అక్రమాలను మరోసారి మీ దృష్టికి తెస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ‘ఎన్నికల నియమావళి ప్రకారం కౌంటింగ్‌ కేంద్రాల్లో జరగాల్సిన వీడియో రికార్డింగ్‌ ప్రక్రియ ఎక్కడా జరగలేదు. చీకటి పడ్డాక అనేకచోట్ల లైట్లు ఆపేసి, ఫలితాలు తారుమారు చేశారు. సింగిల్‌ డిజిట్‌ మెజారిటీ ఫలితాలు వచ్చినప్పుడు మాత్రమే రీకౌంటింగ్‌ చేయాల్సి ఉన్నా, వైసీపీ గెలుపు కోసం రెండు, మూడంకెల తేడా ఉన్నా చేస్తున్నారు. ప్రతిపక్షాలు బలపర్చిన అభ్యర్థుల గెలుపు ఖాయమైనా, ఫలితాలు దాచిపెట్టి, తర్వాత వైసీపీ అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటిస్తున్నారు’ అని చంద్రబాబు ఆరోపించారు.

ఇవిగో ఉదాహరణలు..

‘విశాఖ జిల్లా పెదనగమయ్యపాలెంలో లైట్లు ఆపేసి, వైసీపీ మద్దతు అభ్యర్థికి అనుకూల ప్రకటన చేశారు. గుంటూరు జిల్లా పుసులూరులో ప్రతిపక్షాల మద్దతుదారుడు 9ఓట్ల మెజారిటీతో గెలిచినా, అర్ధరాత్రి వరకు ఫలితం ప్రకటించలేదు. ఇదే జిల్లా అనమర్లపూడిలో వైసీపీ అభ్యర్థి 1 ఓటుతో గెలిస్తే, రీకౌంటింగ్‌ కోరినా పట్టించుకోలేదు. కర్నూలు జిల్లా మిట్లసోమాపురంలో ఒక్కఓటుతో ప్రతిపక్ష అభ్యర్థి గెలిస్తే, వైసీపీ గెలిచినట్లు ప్రకటించారు. రీకౌంటింగ్‌ ప్రతిపాదనను పట్టించుకోలేదు. రాష్ట్రంలో జరిగిన ఈ పరిణామాలపై ఎన్నికల సంఘం విచారించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’ అని చంద్రబాబు తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *