- Local News, News, Political

రాజధాని భూములపై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

విశాఖపట్నం: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని భూములపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. రాజధానిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్ వివరాలను సరైన సమయంలో బయటపెడతామని అన్నారు. రాజధాని భూ అక్రమాలపై తమ వద్ద ఖచ్చితమైన సమాచారం ఉందని ఉద్ఘాటించారు. సరైన సమయంలో ఆ చిట్టాను బయటపెడతామన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ.. రాజధాని తరలిపోతుందనే ప్రజల్లో ఉన్న ఆందోళనకు తాము వెళ్లి సమాధానం చెప్పుకుంటామని అన్నారు. అమరావతి రైతులు ధర్నా చేస్తున్నది కౌలు అందడం లేదనే తప్ప.. రాజధాని విషయంలో కాదని వ్యాఖ్యానించారు. రైతులకు కౌలు ఇచ్చే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. వారం పదిరోజుల్లో రైతులకు కౌలు అందే ఏర్పాటు చేస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు.
రాజధాని విషయంలో పవన్, బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన బొత్స.. వారి తీరును తప్పుపట్టారు. రాజధానిలో అక్రమాలు జరిగాయని గతంలో వారు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. వారి కామెంట్లపై వారికే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. రాజధాని అక్రమాల విషయంలో గతంలో లక్ష మందితో చంద్రబాబు నివాసాన్ని ముట్టడిస్తామని పవన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మంత్రి బొత్స ఉటంకించారు. రాజధాని నిర్మాణం టెండర్లలో అక్రమాలు జరిగాయని జనసేన, బీజేపీ నేతలతో పాటు తామూ ఆరోపించిన విషయాన్ని ప్రస్తావించారు. వాటిని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ప్రభుత్వం జడపదార్థం కాదని వ్యాఖ్యానించారు. ఏ ఒక్క సామాజిక వర్గం కోసమో పనిచేయదని అన్నారు. 13 జిల్లాలు ప్రాతినిధ్యం వహించేదే ప్రభుత్వం అని పేర్కొన్నారు. పార్టీలు గతంలో తాము మాట్లాడిన మాటలపై స్టాండ్ ఇవ్వడం లేదని విమర్శించారు.
ఇదే సమయంలో అమరావతిలో భూముల విషయంపై మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ‘‘తనకు రాజధానిలో సెంటు భూమి కూడా లేదని నిన్న ఓ మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు చెప్పారు. ఆయనకు భూమి ఉందో లేదో దమ్ముంటే చూపమని ఆయనే అడిగితే మేము చూపిస్తాం. ల్యాండ్ రికార్డులు చూపెట్టాలని ఆ నేత సవాల్ చేస్తే చూపెడతాము. మీరు అడిగితే చూపెట్టేది లేదు. ప్రభుత్వం వద్ద అన్ని అంశాలు ఉంటేనే మేము మాట్లాడుతాం’’ అని అన్నారు. కాగా, ఏపీకి నాలుగు రాజధానులు అంటూ ఎంపీ టీజీ వెంకటేశ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. రాజధానులపై ఎవరు అన్నారో వారినే అడగండి అంటూ మీడియా ప్రతినిధులకు బొత్స సూచించారు….

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *