- Local News, News, Political

1నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు

క్రయవిక్రయదారులే వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు

అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం
  రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు

అమరావతి: రాష్ట్రంలో నవంబరు ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను అమల్లోకి తెస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సంబంధిత ఆస్తుల క్రయవిక్రయదారులే పత్రాలు తయారు చేసుకుని ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్‌ రుసుములు చెల్లించేలా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లోని కొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేశారు. అమల్లో ఉన్న లోపాలను గుర్తించి సవరించారు. మధ్యవర్తులు, డాక్యుమెంట్‌ రైటర్లు అవసరం లేకుండా క్రయవిక్రయాలు నిర్వహించడం ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖలో పారదర్శకత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదీ విధానం
* ఆస్తుల క్రయవిక్రయాలు జరిపేవారే వివరాలు నమోదు చేసుకునేలా వివిధ అవసరాలకు తగిన 16 నమూనా డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
* ఇళ్లు, భవనాలు, వ్యవసాయ భూములు, నివాస  స్థలాల క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, తాకట్టు రిజిస్ట్రేషన్‌, బహుమతి రిజిస్ట్రేషన్లు, జీపీఏ కార్యకలాపాలకు అనుగుణంగా నమూనా డాక్యుమెంట్లను స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
* తెలుగు, ఆంగ్ల భాషల్లో వీటిని అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు.
* నమూనాపత్రంలో ఉన్న వివరాలే కాకుండా అదనపు వివరాలున్నా ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకోవాలి.
* ఈ ప్రక్రియ ముగియగానే ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తుదారునికి టైం స్లాట్‌ కేటాయిస్తారు.
* కేటాయించిన సమయానికి సంబంధిత దస్త్రాలను ప్రింట్‌ తీసుకుని కార్యాలయానికి వెళ్తే స్కాన్‌ చేసి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తారు.

అవగాహన కార్యక్రమాలు
రిజిస్ట్రేషన్‌ శాఖలో చేపట్టిన సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించటానికి కమిషనర్‌ సిద్ధార్థ్‌ జైన్‌ ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 14వ తేదీన కర్నూలు, విజయనగరం, 15న అనంతపురం, శ్రీకాకుళం, 16న కడప, విశాఖపట్నం, 17న చిత్తూరు, తూర్పుగోదావరి, 18న నెల్లూరు, పశ్చిమగోదావరి, 19న ప్రకాశం, కృష్ణా, 21న గుంటూరు జిల్లాలో బృందాలు పర్యటించనున్నాయి. న్యాయవాదులు, వైద్యులు, స్థిరాస్తి వ్యాపారులు, బిల్డర్లు, పురప్రముఖులు, సాధారణ ప్రజలు పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.

తిరస్కరిస్తే అప్పీల్‌కు అవకాశం
సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డాక్యుమెంట్లను ఏ కారణంతో తిరస్కరించినా దరఖాస్తుదారు అప్పీల్‌ చేసే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ చట్టం సెక్షన్‌ 73, 74 కింద జిల్లా రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ కారణాలతో డాక్యుమెంట్‌ను తిరస్కరించారో సంబంధిత అధికారి నిర్ణీత వ్యవధిలో వివరణ ఇవ్వాలి.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *